A Lebanese man entered a bank with a gun for money
mictv telugu

సొంత డబ్బుపై ఆంక్షలు.. తుపాకీ, పెట్రోల్‌తో బ్యాంకులోకి ఎంటరైన కస్టమర్

August 12, 2022

A Lebanese man entered a bank with a gun for money

మనం అవసరాలకు పనికొస్తుందని కొంత డబ్బు బ్యాంకులో జమ చేస్తాం. మళ్లీ అత్యవసరమైనప్పుడు వాటిని తీసుకొని అవసరాలు తీర్చుకుంటాం. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఓ వ్యక్తికి మాత్రం బ్యాంకు వారు ఆంక్షలు పెట్టారు. అడిగినంత డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో కస్టమరు కోపంతో ఊగిపోతూ బ్యాంకు నుంచి బయటికి వచ్చాడు. కాసేపటికి చేతిలో తుపాకీ, పెట్రోల్‌తో బ్యాంకులోకి ఎంటరయి డబ్బివ్వకుంటే చంపుతా లేదంటే పెట్రోల్ పోసుకుని చస్తానని రచ్చ రచ్చ చేశాడు.

అసలు బ్యాంకు వారు డబ్బెందుకు ఇవ్వనన్నారో తెలిస్తే ఆ పరిస్థితి మనకు రానందుకు మీరు సంతోషపడతారు. పూర్తి వివరాల్లోకెళితే.. ఈ సంఘటన లెబనాన్ దేశంలో జరిగింది. బస్సామ్ అల్ షైక్ హుస్సేన్ అనే వ్యక్తి ఫుడ్ డెలివరీ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అలా కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత రాజధాని బీరట్‌లో ఉండే బ్యాంకులో దాచుకున్నాడు. అలా మొత్తం డబ్బులు 1.62 కోట్ల వరకు జమయ్యాయి. అయితే ఇటీవల హుస్సేన్ తండ్రి అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రిలో చేర్చగా, దానికి కొంత డబ్బు అవసరమై బ్యాంకుకు వెళ్లాడు. అయితే బ్యాంకు వారు డబ్బివ్వడానికి నిరాకరించడంతో తన పరిస్థితిని వారికి వివరించినా ససేమిరా అనడంతో పైన చెప్పినట్టు తుపాకీ, పెట్రోల్‌తో వచ్చి డబ్బివ్వమని సిబ్బందిని బెదిరించాడు. తర్వాత కాసేపటికి పోలీసులు రావడంతో బ్యాంకు వారికి సర్ది చెప్పి ఆఖరికి 35 వేల డాలర్లు ఇప్పించారు. ఈ దృష్యాలు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే బ్యాంకు వారు ఎందుకు ఇవ్వనన్నారంటే.. లెబనాన్ దేశం 2019 నుంచి ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటోంది. దీంతో ప్రభుత్వం దేశ పౌరుల డబ్బుపై ఆంక్షలు విధించింది. విత్‌డ్రాపై పరిమితులు పెట్టడంతో కావాల్సినంత డబ్బు తీసుకోవడానికి వీలు పడడం లేదు.