వాగులో లారీతో కొట్టుకుపోయిన డ్రైవర్.. హెలికాప్టర్‌తో గాలింపు - MicTv.in - Telugu News
mictv telugu

వాగులో లారీతో కొట్టుకుపోయిన డ్రైవర్.. హెలికాప్టర్‌తో గాలింపు

August 15, 2020

A lorry flushed up in a river .. A helicopter for a lost driver

మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ వద్ద వాగులో ఓ లారీ గల్లుంతు అయింది. వాగు ఉధృతికి లారీ నీళ్లలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, డ్రైవర్ గల్లంతు అయ్యాడు. గల్లంతైన లారీ డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఒక చెట్టును ఒడుపుగా పట్టుకున్నాడు. ఎవరైనా వచ్చి తనను రక్షించాలని సహాయం కోసం మధ్యాహ్నం వరకు ఆర్తనాదాలు చేశాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి హరీశ్‌రావు.. లారీ డ్రైవర్‌ను కాపాడాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో సీపీ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. డ్రైవర్‌ను కాపాడేందుకు ప్రయత్నించాయి. 

చెట్టుకు పట్టుకుని ఉన్న డ్రైవర్‌ను కాపాడేందుకు తాడు సాయంతో ప్రయత్నంచారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతను కొట్టుకుపోయాడు. అనంతరం హెలికాప్టర్‌తో గాలింపు చేపట్టినా డ్రైవర్‌ ఆచూకీ లభ్యంకాలేదు. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం బోటు సాయంతో వాగులో గాలిస్తున్నాయి. ఇదిలావుండగా పరకాల నుంచి అంబాల మీదుగా హన్మకొండ చేరుకునే దారిలో శుక్రవారం రాత్రి వాగులో ఓ బస్సు చిక్కుకుపోయింది. నడికుడ మండలంలోని కంఠాత్మకూర్‌ గ్రామం వద్ద లోలెవల్‌ వంతెన మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పులిగిల్ల నుంచి ఓ బస్సు హన్మకొండకు వెళ్తుండగా లోలెవల్ వంతెన మీద వరద నీటి ప్రవాహంలో చిక్కుకుంది. వరద ఉధృతి తక్కువగా ఉండడంతో డ్రైవర్‌, కండక్టర్‌, ఇతర ప్రయాణికులు బస్సు దిగి బయటికి రావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శనివారం ఉదయం వరద ఉధృతి ఇంకా పెరిగింది. వరద ఇలాగే కొనసాగితే కాసేపట్లో బస్సు కొట్టుకుపోవచ్చని స్థానికులు భావిస్తున్నారు.