మాంసాహారుల కన్నా వారి గుండె పదిలం  - MicTv.in - Telugu News
mictv telugu

మాంసాహారుల కన్నా వారి గుండె పదిలం 

February 4, 2020

gnm

శాఖాహారం తింటే అందని పోషకాలు మాంసాహారం తింటే అందుతాయని కొందరు భావిస్తారు. ఈ క్రమంలో అదే పనిగా మాంసాహారం తింటుంటారు. అలా తినితిని ఊబకాయాన్ని తెచ్చుకుని గుండెజబ్బులకు లోనవుతుంటారు. మాంసాహారం కన్నా శాఖాహారం శరీరానికి ఎంతో మంచిది అని వైద్యులు ఎంత చెప్పినా వినరు. మాంసాహారం తినకపోవడంతో కొన్ని పోషక పదార్థాలు తమ శరీరానికి అందకుండా పోతున్నాయని బాధపడిపోతుంటారు. అలాంటివారకి  అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ వర్సిటీ పరిశోధకులు ఓ చల్లని కబురు చెప్పారు. 

మాంసాహారం తినకుండా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తినేవారికి  హృద్రోగాలు వచ్చే ముప్పు తక్కువగా ఉన్నట్లు తేల్చి చెప్పారు. వీటిలో ‘సల్ఫర్‌ అమైనో యాసిడ్‌’ మోతాదు చాలా తక్కువగా ఉంటుందని.. దీంతో ఈ ముప్పు తగ్గుతుందని వారి పరిశోధనలో తేల్చారు. అయితే, ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం, డెయిరీ ఉత్పత్తులు, సోయాబీన్‌ వంటి వాటిలో అమైనో యాసిడ్ల మోతాదు అధికంగా ఉంటుందని వెల్లడించారు. దీంతో గుండె పనితీరు, ఇతర  క్రియలను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.