‘బయటికి’ పోతే రేషన్‌కార్డు రద్దు.. పట్టిస్తే పన్ను రాయితీ - MicTv.in - Telugu News
mictv telugu

‘బయటికి’ పోతే రేషన్‌కార్డు రద్దు.. పట్టిస్తే పన్ను రాయితీ

November 29, 2019

Ration Cards

బహిరంగ మలవిసర్జనను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వచ్ఛభారత్‌లో భాగంగా కేంద్రం ఇచ్చిన తొలి పిలుపు ఇదే. సబ్సిడీ కింద మరుగుదొడ్లు కూడా కట్టిస్తోంది ప్రభుత్వం. అయితే ఇంకా కొన్ని గ్రామాల్లో ఈ చైతన్యం రాలేదు. ఇంకా బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా జరాండీ గ్రామంలో ఇంకా చాలామంది బహిరంగ ప్రదేశాల్లోనే మలవిసర్జన చేస్తున్నారు. రకరకాల జబ్బులు వస్తున్నాయి. దీంతో జరాండీ గ్రామ పంచయతీ అధికారులు ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. చెప్తే విననివాళ్లను కొట్టి చెప్పాలని వారు భావించారు.  

బహిరంగంగా మలవిసర్జన చేస్తూ గ్రామస్థులు ఎవరైనా పట్టుబడితే వారి కుటుంబానికి రేషన్ కార్డులను రద్దు చేయాలని గ్రామ పంచాయితీ అధికారులు తీర్మానించారు.  ఈ విషయాన్ని జరాండి గ్రామ పంచాయతీ సర్పంచ్ సమాధన్ తయాడే వెల్లడించారు. మరో ఆఫర్ ఏం పెట్టారంటే.. బహిరంగంగా మలవిసర్జన చేసే వ్యక్తుల ఫోటోలు తీసి గ్రామ పంచాయతీకి సమర్పిస్తే వారికి పన్నుల్లో రాయితీ కల్పిస్తామని సర్పంచ్ తెలిపారు. 

గ్రామంలో 5 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. చాలామందికి మరుగుదొడ్లు ఉన్నా వాటిని వినియోగించకుండా బహిరంగ మలవిసర్జనకు పూనుకుంటున్నారని సర్పంచ్ వాపోయారు. వారంతా గ్రామానికి ప్రవేశించే రోడ్డు వెంటే వరుసగా మలవిసర్జన చేస్తున్నారు. దీంతో దర్గంధం వస్తోందని, ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు చేసి, ఎంత చెప్పినా కొందరు ఆ పాత అలవాటును మార్చుకోలేకపోతున్నారు. దీంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ నిబంధన కాస్త కఠినంగా ఉన్నా పంచాయితీ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.