A man barking like a dog six months after being bitten by a dog in odisha
mictv telugu

కుక్క కరిస్తే లైట్ తీసుకున్నాడు.. 6 నెలల తర్వాత అనుభవిస్తున్నాడు

November 4, 2022

ఓ యువకుడు కుక్క కరిస్తే లైట్ తీసుకున్నాడు. ఇంట్లో వాళ్లు, స్నేహితులు చెప్పినా చికిత్స తీసుకోవడానికి నిరాకరించాడు. అయితే ఆరు నెలల తర్వాత దాని ప్రభావం బయటపడింది. యువకుడిలో వింత మార్పులు వచ్చాయి. దీంతో అతని దగ్గరికి వెళ్లేందుకు మనుషులు భయపడే పరిస్థితి నెలకొంది. ఒడిషాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కటక్‌లోని ఆథాఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉదయ్ పూర్ గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తికి ఆరు నెలల కింద ఓ కుక్క కరిచింది. అయితే రాజేష్ దానికి ఎలాంటి చికిత్స తీసుకోలేదు. ఎవరు ఎంత నచ్చజెప్పినా నాకేం కాదనే అతి నమ్మకంతో తేలిగ్గా తీసుకున్నాడు. ఇలా ఆరు నెలలు గడువగా, ఇప్పుడు అచ్చం కుక్కలాగే అరుస్తూ అందరినీ భయపెడుతున్నాడు. దాంతో కుటుంబ సభ్యులు షాకయి వెంటనే బలవంతంగా ఆస్పత్రికి తీసుకెళ్లగా, రాజేష్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. రాజేష్‌లో రేబిస్ వ్యాధి లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని స్పష్టం చేశారు. కుక్క కరిచిన తర్వాత చికిత్స తీసుకోకపోతే సాధారణంగా హైడ్రో ఫోబియా లేదా నీటి భయం ఏర్పడుతుందని, బాధితులు నీటి శబ్దాన్ని కూడా తట్టుకోలేరని చెప్తున్నారు. అంతేకాక, గొంతు నొప్పితో కుక్కలా అరవడం మొదలు పెడతారని తెలియజేశారు. ప్రస్తుతం రాజేష్‌కి చికిత్స కొనసాగిస్తున్నారు.