ముద్ర లోన్ అని కాల్ వచ్చిందా? ఇతడు ఎలా మోసపోయాడో చదవండి... - MicTv.in - Telugu News
mictv telugu

ముద్ర లోన్ అని కాల్ వచ్చిందా? ఇతడు ఎలా మోసపోయాడో చదవండి…

May 16, 2022

తెలియని వ్యక్తులు, నెంబర్ల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, అవి మోసంతో కూడి ఉంటాయని అధికారులు, పోలీసులు ఎంత అవగాహన కలిగిస్తున్నా కొందరు వినిపించుకోవట్లేదు. డబ్బు మీద మక్కువతో అత్యాశకు పోయి ఉన్న డబ్బులను పోగొట్టుకుంటున్నారు. అయితే చాలా వరకు ప్రజలు తమ జాగ్రత్తలో ఉన్నా.. కేటుగాళ్లు రోజురోజుకీ తెలివిమీరి కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందించే ముద్ర లోన్‌ను ఎరగా వేశాడు ఓ సైబర్ నేరగాడు. ఫలితంగా బాధితుడు రూ. 1.28 లక్షలు మోసపోయాడు. వివరాలు.. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి ముద్ర లోన్ కావాలా అంటూ ఆన్‌లైన్‌లో వచ్చిన ఓ లింకును క్లిక్ చేశాడు. దాంతో ఓవ్యక్తి లైన్లోకి వచ్చి ముందుగా వివరాలు కావాలంటూ అడిగి తీసుకున్నాడు. అనంతరం లోన్ కావాలంటే ముందుగా కొంత నగదు ఇవ్వాల్సి ఉంటుందని నమ్మబలికాడు. నేరగాడి మాటలు నమ్మిన ఓబుల్ రెడ్డి తన అకౌంట్ ద్వారా దశల వారీగా ఆన్‌లైన్‌లో ఒక లక్షా ఇరవై ఎనిమిది వేల రూపాయలను ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించిన ఓబుల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.