మా కుక్క పోయింది, పిల్లి పోయింది అంటూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కే వ్యక్తులను చూసి ఉంటాం. కానీ తొలిసారిగా ఓ వ్యక్తి తాను కోడి పందేల కోసం ముద్దుగా పెంచుకుంటున్న కోడి పుంజు పోయిందని ఫిర్యాదు చేశాడు. ప్రత్యేక జాతికి చెందిన ఆ పుంజు విలువ రూ. 9 వేలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆసక్తికరంగా ఉన్న ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలోని పెద్ద వంకపల్లెకు చెందిన వెంకటాద్రి అనే వ్యక్తి తమిళనాడులోని సేలం నుంచి కొన్ని జాతి పుంజులను తెచ్చుకొని పెంచుకుంటున్నాడు.
కాలక్రమేణా వాటిలో చాలా వరకు పుంజులు చనిపోగా, ఒక్కటి మాత్రం బతికింది. దీంతో ఆ పుంజును ప్రేమగా, ఎంతో ఇష్టంగా చూసుకుంటున్నాడు. అయితే మూడ్రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా దొంగలు పుంజును ఎత్తుకెళ్లిపోయారు. దాంతో వెంకటాద్రి వాల్మీకిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పెద్దవంక గ్రామ పరిసరాల్లో కోళ్ల పందాలు జరుగుతుంటాయని, అక్కడి వారే ఎత్తుకెళ్లిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని ఫిర్యాదులో సైతం పేర్కొన్నాడు. దాంతో విషయం ఆ నోటా ఈ నోటా పడి సంచలనంగా మారింది. ఇప్పుడీ పుంజును ఎలా వెతికి పెట్టాల్రా బాబూ అంటూ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ బిందు మాధవి తెలపడం కొసమెరుపు.