కుక్కలా బతకాలని కోరిక.. 11 లక్షలు ఖర్చు పెట్టించింది - MicTv.in - Telugu News
mictv telugu

కుక్కలా బతకాలని కోరిక.. 11 లక్షలు ఖర్చు పెట్టించింది

May 24, 2022

జీవితంపై విరక్తి అనిపించినప్పుడు వెధవ కుక్క బతుకయిపోయింది అని అంటూంటాం. కానీ, ఇక్కడు ఓ వ్యక్తి నిజంగా కుక్కలానే బతకాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా రూ. 11 లక్షలు ఖర్చు చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జపాన్ వ్యక్తి కథ ఇది. వివరాల్లోకెళితే.. టోకో అనే వ్యక్తికి ఎప్పటినుంచో కుక్కలా బతకాలనే కోరిక ఉంది. అందుకోసం బాడీ లాంగ్వేజీని కుక్కలా మార్చుకున్నాడు. నడవడం, నాలుక బయటికి చాపడం, మూత్రం పోయడం వంటివన్నీ నిజం కుక్కలాగే చేయడం మొదలుపెట్టాడు. కానీ, ఏదో అసంతృప్తి.

కుక్క చేష్టలన్నీ చేస్తున్నా కానీ, కుక్కలా కనిపించడం లేదని గుర్తించాడు. అందుకోసం స్పెషల్ ఎఫెక్ట్ వర్క్ షాప్ వాళ్లను కలిసి తన మనసులోని మాటను వారికి వివరించాడు. వారు దీనికి పరిష్కారంగా అల్ట్రా రియలిస్టిక్ డాగ్ క్యాస్టూమ్ ఉందని చెప్పి వాటిపై అధ్యయనం చేశారు. చాలెంజ్‌గా తీసుకొని కుక్కల శరీర నిర్మాణ శైలిని పరిశీలించి 40 రోజుల్లో క్యాస్టూమ్ తయారు చేశారు. వాటిని చూస్తే ఎవ్వరికీ ఏ మాత్రం అనుమానం రాని విధంగా తీర్చి దిద్దారు. ఇందుకోసం దాదాపు పదకొండు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. తర్వాత దీనిని టోకోకి చూపించగా, అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే ఆ దుస్తులు వేసుకొని వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇది తెలుసుకొన్న స్థానిక మీడియా కూడా టోకో గురించి ప్రసారం చేయడంతో టోకో కొద్ది రోజుల్లోనే వైరల్‌గా మారాడు. టోకో వేసుకున్న కుక్క క్యాస్టూమ్ చూస్తే నిజంగా కుక్కే అని మనం కూడా భ్రమ పడతాం. తర్వాత అసలు విషయం తెలిసి అవాక్కవుతాం. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా తమ కామెంట్లు చేస్తున్నారు. కుక్కలా బతకడమేంటిరా అని, అతని వల్ల ఎవరికీ నష్టం లేదు అని, ఎవరిష్టం వారిది అంటూ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.