వ్యక్తులు తమకు నచ్చిన చిత్రాలు, నచ్చిన పేర్లను టాటూలుగా వేయించుకుంటారు. కానీ బార్ కోడ్ టాటూగా వేయించుకోవడం చూశారా?స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్నది. ఫోన్ లేకుండా పూట గడవని పరిస్థితిగా మారింది. నగదు చెల్లింపులు కూడా ఇప్పుడు ఫోన్ ద్వారానే అవుతున్నాయి. మన దగ్గర యూపీఐ చెల్లింపులు చేస్తున్నాం కదా! ఫోన్ లో కోడ్ స్కాన్ చేసి యాప్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. తైవాన్ కి చెందిన ఓ వ్యక్తి కొత్త పద్ధతిని అనుసరించాడు. బయటకు వెళ్లిన ప్రతిసారీ ఫోన్ తీసుకెళ్లడం అతడికి బద్ధకం. కానీ ఏదైనా కొనాలంటే చెల్లింపుల కోసం ఫోన్ తప్పనిసరి. ఈ చెల్లింపులు ఈజీగా అయ్యేలా చేయాలని చేతి పై ఏకంగా బార్ కోడ్ టాటూ వేయించుకున్నాడు.
ఈ వ్యక్తి తన వివరాలు తెలియచేయడానికి నిరాకరించాడు. కానీ ఇతడు టాటూ వేయించుకునేది మాత్రం వీడియో తీయించుకున్నాడు. స్థానిక వార్తా నివేదిక ప్రకారం.. అక్కడి లోకల్ సోషల్ మీడియా ‘డీకార్డ్’లో ఈ విషయాన్ని పంచుకున్నాడు. దీంతో అతను ‘టాక్ ఆఫ్ ది తైవాన్’ గా మారాడు. అతను టాటూ వేయించుకోవాలని చాలా కాలంగా ఆలోచించాడట. కానీ అన్ని బార్ కోడ్స్ వేర్వేరు పొడవులు, సంఖ్యలు, పంక్తుల వెడల్పుతో విభిన్న నమూనాను కలిగి ఉంటాయి. సరిగ్గా బార్ కోడ్ రూపొందించే టాటూ ఆర్టిస్టు కోసం ఇన్ని రోజులు ఆగాడు. దొరికగానే వేయించుకున్నాడు. ఇప్పుడు ఈ బార్ కోడ్ తో చెల్లింపులు కూడా చక్కగా చేస్తున్నాడట.
‘పచ్చబొట్టు వేయించుకోవచ్చు. కానీ బార్ కోడ్ వేయించుకోవడం మంచిది కాదు. తనలా ఎవరూ ఆలోచించొద్దనే సలహా ఇస్తున్నా. ఎందుకుంటే ఈ టాటూ మెయింటెన్ చేయడం చాలా ఇబ్బంది. దీంట్లో ఏ కొంచెం మార్పు వచ్చినా బార్ కోడ్ పని చేయదు’ అంటున్నాడీ తైవాన్ అబ్బాయి.