నగరంలో పోలీసులు కొత్తగా విధించిన ట్రాఫిక్ చలాన్లు వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న రూల్స్ కాకుండా సోమవారం నుంచి కొత్త నిబంధలు అమల్లోకి రావడంతో బైకర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఓ బైకర్.. కోపంతో తన వాహనాన్ని తానే తగులబెట్టుకున్నాడు. సోమవారం సాయంత్రం అమీర్ పేటలో జరిగిన ఈ షాకింగ్ ఘటన గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. మైత్రీవనం వద్ద కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం స్టాప్ లైన్ దాటారని పోలీసులు చలాన్ విధించారు.
దీంతో వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓ బైకర్ ఆగ్రహంతో తన బైకును తానే తగులబెట్టుకున్ాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పేశారు. కొత్తగా తెచ్చిన నిబంధనల గురించి అవగాహన కల్పించకుండా డబ్బు వసూలు చేయడమే లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని, సామాన్య, మధ్యతరగతి జేబులు కొల్లగొడుతున్నారంటూ మండిపడ్డారు. దీనికి పోలీసులు.. సోమవారం నుంచి నగరంలో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారని, నిబంధనల ప్రకారమే తాము చలాన్లు విధిస్తున్నామని వివరణ ఇచ్చారు. కాగా, కొత్తగా వచ్చిన ట్రాఫిక్ రూల్స్ ఇలా ఉన్నాయి. స్టాప్ లైన్ దాటితే రూ. 1000 జరిమానా, ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే రూ. 1000 జరిమానా, ఫుట్ పాత్‌లను ఆక్రమించినా, వాహనాలను అడ్డంగా పార్క్ చేసినా రూ. 600 జరిమానా విధిస్తారు. గతంలో ఉన్న నిబంధనలకు ఇవి అదనం.