A man suffering from 'menstruation' for 33 years...doctors are shocked..
mictv telugu

33ఏళ్లుగా ‘రుతుస్రావం’తో వేదనపడిన వ్యక్తి..చివరికి..

July 12, 2022

‘రుతుస్రావం’ అనే పదం మగవాళ్లకు సంబంధించినది కాదు. ఇది పూర్తిగా ఆడవారికి సంబంధించినదే. కానీ, ఓ వ్యక్తి 33 ఏళ్లుగా ‘రుతుస్రావం’తో వేదనపడిన అరుదైన ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది. మగవాడికి ‘రుతుస్రావం’ రావటం ఏంటీ? ఇది నిజమేనా? ఎక్కడ జరిగింది? అని ప్రజలు పలు ప్రశ్నాలను రేకెత్తిస్తున్నారు. ఈ అరుదైన ఘటన ఎక్కడ జరిగింది, డాక్టర్లు ఏం చెప్పారు అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే..

చైనా దేశానికి చెందిన లీ డాంగ్‌ అనే వ్యక్తి మూత్ర విసర్జన సమయంలో సమస్యలు ఏర్పడగా, యుక్త వయసులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి అతనికి మూత్ర విసర్జన సమయంలో రక్తం వస్తోంది. తరచూ కడుపునొప్పితో బాధపడేవాడు. గతంలో నాలుగు రోజులపాటు తీవ్ర పొత్తికడుపు నొప్పి వేధించడంతో వైద్యులు అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించారు. అయినా, లాభం లేకుండా పోయింది. ఆ సమస్య అలాగే వెంటాడింది. దీంతో పూర్తిస్థాయిలో అతడిని పరీక్షించిన వైద్యులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.

ఆ వ్యక్తిలో స్త్రీ క్రోమోజోమ్‌లు ఉన్నాయని గుర్తించారు. రక్తస్రావం అనారోగ్యం కారణంగా జరుగుతోంది కాదని, అది ”రుతుస్రావం” వల్ల అని తేల్చారు. కడుపు నొప్పికి కారణం కూడా ఇదేనని పేర్కొన్నారు. లీ డాంగ్ పూర్తిస్థాయిలో పురుషుడు కాదని, అతడు పురుష, స్త్రీ క్రోమోజోమ్ కలగలిసిన ‘ఇంటర్ సెక్స్’  వ్యక్తి అని వైద్యులు వెల్లడించారు. లీకి గర్భాశయం, అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయని వైద్య పరీక్షలో గుర్తించారు.

ఇక, చివరగా పురుష సెక్స్ హార్మోన్ ఆండ్రోజెన్ స్థాయిలు సగటు కంటే తక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. స్త్రీ సెక్స్ హార్మోన్లు, అండాశయ కార్యకలాపాల స్థాయిలు ఓ ఆరోగ్యకరమైన మహిళల మాదిరిగానే ఉన్నాయని, అతడిని ఇంటర్ సెక్స్‌గా డాక్టర్లు గుర్తించారు. అయితే, 30ఏళ్లకు పైగా పురుషుడిగా జీవించిన లీ డాంగ్ తాను ఇంటర్ సెక్స్ అని తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన స్త్రీ పునరుత్పత్తి అవయవాలను తొలగించాల్సిందిగా వైద్యులను అభ్యర్థించాడు. దాంతో తాజాగా లీకి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.