ఇప్పటి వరకు కాదేదీ కవితకనర్హం అని మాట్లాడుకున్నాం. ఇకపై కాదేదీ చోరీకనర్హం అని కూడా మాట్లాడుకోవాలేమో. ఈ సంఘటన చూస్తే ఇలాగే అనిపిస్తుంది. చివరకు పబ్లిక్ టాయిలెట్‌నూ వదలని వైనం హైదరాబాద్‌లో బయటపడింది. మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్‌లో జీహెచ్ఎంసీ పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేసింది. అయితే వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో చాలా చోట్ల నిరుపయోగంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో దొంగల కన్ను వీటి మీద పడింది. ఈ నెల 16న టాయిలెట్‌ను దొంగలు రాత్రికిరాత్రే మాయం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. దాని ఆధారంగా నిందితుడు దోమల్‌గూడలో నివసించే ముప్పారం జోగయ్యగా గుర్తించారు. అతడిని పట్టుకుని విచారించగా, జీహెచ్ఎంసీలో పనిచేసే అరుణ్ కుమార్, ప్రైవేటు కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే భిక్షపతి సహకారంతో దొంగతనం చేసినట్టు నేరం ఒప్పుకున్నాడు. టాయిలెట్‌లోని ఇనుమును తుక్కుగా మార్చి రూ. 45 వేలకు దాన్ని అమ్మినట్టు వెల్లడించాడు. కాగా, జోగయ్యను రిమాండ్‌కు తరలించి, మిగతా ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.