సాధారణంగా మనుషులు శక్తికోసం ఆహారపదర్ధాలను తింటారు. కానీ, ఒక వ్యక్తి మాత్రం కేవలం రాళ్లను మాత్రమే తింటున్నాడు. 12 ఏళ్లుగా ఇలా రాళ్లనే ఆహారంగా తీసుకుంటున్నా.. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడం గమనార్హం. వినడానికి వింతగా అనిపించే ఈ వ్యక్తి మన పక్క రాష్ట్రమైన చత్తీస్గఢ్లో ఉన్నాడు. జాష్పూర్ జిల్లాలో సంతోష్ లాక్రా అనే వ్యక్తి రోజుకు సంచులు, సంచులు రాళ్లను తింటాడు. ఆశ్చర్యంగా అతని భార్య కూడా అతనికి సహాయపడుతుంది. లాక్రా క్రిస్టియన్ మతానికి చెందినవాడు. అతనికి దైవ శక్తులున్నాయనీ, అందుకే రాళ్లను తింటున్నా ఏమీ కావట్లేదని స్థానికుల నమ్మకం. ఇతని వద్దకు తమ బాధలు, కష్టాలు చెప్పుకోవడానికి చాలా మంది వస్తుంటారు. దేవునికి ప్రార్థనలు చేసి బాధలు పోగొడతాడని నమ్ముతారు. రాళ్లను తినడం అనేది దేవుని అనుగ్రహమేనని వారు భావిస్తారు. కాగా, కొందరు దీనిని మూఢనమ్మకంగా కొట్టిపారేస్తున్నారు. నిపుణుడైన ఓ డాక్టర్ ఈ విషయంపై స్పందిస్తూ.. అతను ఎలాంటి రాళ్లను తింటున్నాడో గమనించాల్సి ఉందన్నారు. ఇతని మూఢనమ్మకాన్ని ప్రజలు పాటించి ప్రాణాలమీదకు తెచ్చుకొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు.