వైరల్ వీడియో : ఇసుకను 40 ఏళ్లుగా అన్నంలా తినేస్తున్న వ్యక్తి - Telugu News - Mic tv
mictv telugu

వైరల్ వీడియో : ఇసుకను 40 ఏళ్లుగా అన్నంలా తినేస్తున్న వ్యక్తి

June 8, 2022

మనం రోజూ తినే అన్నంలో ఒక్క రాయి వస్తే వెంటనే నోట్లోని ముద్దను బయటికి ఉమ్మేస్తాం. కానీ ఒడిషాలో ఓ వ్యక్తి మాత్రం 40 ఏళ్లుగా ఇసుకను అన్నంలా తినేస్తున్నాడు. మరి ఇంత ఇసుక తింటున్నాడు అతనికి ఏమీ కాదా? అంటే అతనికి ఇప్పటివరకు ఏ ఆరోగ్య సమస్యా రాలేదంట. ఈ విషయాన్ని అందరి ముందు ధైర్యంగా చెప్తూ అందరి ముందే ఇసుకను ముద్దలా చేసుకొని లాగించేస్తున్నాడు. హరిలాల్ సక్సేనా అనే ఉత్తర ప్రదేశ్‌కి చెందిన వ్యక్తి పదేళ్ల క్రితం ఒడిషాలోని గంజాం జిల్లాకు ఉపాధి నిమిత్తం వలస వచ్చాడు. కీర్తిపూర్‌లో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే అతని ఇసుకను తినే అలవాటును చూసి చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతున్నారు. అన్నం తినక ముందో లేదా తిన్న తర్వాతో గుప్పెడు ఇసుకను తింటున్నాడు. ఈ విషయాన్ని అతడిని అడుగగా, తనకు ఇసుక తినడం చిన్నప్పటి నుంచి అలవాటుగా మారిందని చెప్తున్నాడు. వయసులో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా తినేవాడినని, ఇప్పుడు బాగా తగ్గించేశానని అంటున్నాడు. ఈ అలవాటు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తే.. ‘చిన్నప్పుడు మా ఊరి దగ్గర ఒక నది ఉండేది. రోజూ నది వద్దకు వెళ్లి తెలియని తనంలో ఇసుకను తినడం ప్రారంభించా. ఆ తర్వాత అలవాటయిపోయింది. వానాకాలం వస్తే నీటి ప్రవాహం పెరుగుతుంది కాబట్టి ముందే కొంత ఇసుకను తెచ్చి దాచిపెట్టుకునేవాడిని. ఇసుకను తిన్న తర్వాత కొద్ది సేపు అసౌకర్యంగా ఉంటుంది కానీ, తర్వాతకి అంతా మామూలయిపోతుంది. అంతేకాక, ఇసుక తినడం వల్ల నాకు ఇంత వరకు ఒక్క అనారోగ్య సమస్య రాలేదు’ అంటూ బదులిచ్చాడు.