మనుషులు సాధారణంగా కుక్కలు, పిల్లులు, ఆవులు, చిలుకలు, గుర్రాలు వంటి వాటితో స్నేహం చేస్తారు. అవి కూడా మనతో మంచిగా స్నేహంగా ఉంటాయి. కానీ, ఓ వ్యక్తి ఏకంగా అడవి పందితో స్నేహం చేశాడు. అదీ ఇరవై ఏళ్ల నుంచి. అయితే ఇప్పటివరకు ఆ పంది వ్యక్తికి ఎలాంటి ఎలాంటి హాని తలపెట్టకపోవడం గమనార్హం. పూర్తి వివరాల్లోకెళితే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాలో మహేంద్ర అనే వ్యక్తి నివసిస్తున్నాడు. 20 ఏళ్ల క్రితం మహేంద్ర నివసిస్తున్న ప్రాంతానికి వరదలు రాగా, ఆ వరదల్లో ఓ పంది పిల్ల కొట్టుకువచ్చింది.
అప్పటికే వానలో బాగా తడిచి కొన ఊపిరితో ఉన్న పందిపిల్లను చూసిన మహేంద్ర జాలిపడి దానిని చేరదీశాడు. దానికి ఆహారం అందించి రక్షణ కల్పించాడు. కొన్ని రోజుల తర్వాత అటవీ శాఖ సిబ్బందికి సమాచారమందించి, వాళ్లకు అప్పగిస్తుండగా, వారు నిరాకరించి పిల్లను మహేంద్రకే అప్పగించారు. చిన్న పిల్లను అడవిలో వదిలితే క్షేమంగా ఉండదని వారు భావించి అలా చేశారు. దాంతో మహేంద్ర చేసేది లేక తానే ఆ పందిని పెంచుకున్నాడు. ముద్దుగా దానికి రాజు అని పేరు పెట్టుకున్నాడు. కొంచెం పెద్దయ్యాక రెండు సార్లు అడవిలో వదిలిరాగా, పంది మాత్రం తిరిగి మహేంద్ర వద్దకు చేరుకునేది. దీంతో దానిపై ప్రేమ ఎక్కువైన మహేంద్ర అప్పటినుంచి దానిని అంటిపెట్టుకునేవాడు. జనం కూడా పందితో స్నేహంగా ఉండేవారు. ఎవ్వరికీ ఏ హానీ తలపెట్టేది కాదు. ఆహారం కోసం కొన్నిసార్లు ఆ పంది అడవిలోకి వెళ్లినా సాయంత్రం అయ్యేసరికి తిరిగి మహేంద్ర ఇంటికి చేరుకుంటుంది. రాత్రి వేళ మహేంద్రను విడిచి ఆ పంది నిద్ర కూడా పోదు. ప్రస్తుతం ఈ విషయాన్ని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చాలా మంది వారి స్నేహాన్ని మెచ్చుకుంటున్నారు.