A massive fire in the Rohingya refugee camp in Bangladesh.
mictv telugu

బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్థుల శిబిరంలో భారీ అగ్నిప్రమాదం.

March 6, 2023

A massive fire in the Rohingya refugee camp in Bangladesh.

బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా ముస్లింలతో నిండిన శరణార్థి శిబిరంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కాక్స్ బజార్‌లోని బలుఖాలీ క్యాంపులో సంభవించిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారి ఎమ్దాదుల్ హక్ తెలిపారు. బంగ్లాదేశ్‌లోని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ (UNHCR) కార్యాలయం, రోహింగ్యా శరణార్థులు స్వచ్ఛంద సంస్థ, దాని భాగస్వాములతో కలిసి మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారని ట్వీట్ చేసింది. అయితే ఈ అగ్నిప్రమాదం గురించి పూర్తి వివరాలను వెల్లడించలేదు.

గత కొన్ని దశాబ్దాలుగా మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు పది లక్షల మంది రోహింగ్యా శరణార్థులు పారిపోయారు. వీరిలో 7.4 లక్షల మంది ఆగస్ట్ 2017లో మయన్మార్ సైన్యం క్రూరమైన అణిచివేత ప్రారంభించినప్పుడు బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పది లక్షల మందికి పైగా రోహింగ్యా శరణార్థులు నివసిస్తున్నారు. మయన్మార్‌లో హింస నుండి తప్పించుకోవడానికి దేశంలో ఆశ్రయం పొందవలసి వచ్చిన రోహింగ్యాలను శాంతియుతంగా స్వదేశానికి రప్పించడానికి బంగ్లాదేశ్ ఇటీవల భారత్ సహకారాన్ని కోరింది.