A minor son who sacrificed his parents
mictv telugu

సోదరుడి కోసం తల్లిదండ్రులను బలిచ్చిన మైనర్ కుమారుడు

August 9, 2022

సోదరుడి కోసం తాంత్రికుడి మాటలు విని సొంత తల్లిదండ్రులనే బలి ఇచ్చాడు ఓ మైనర్ కుమారుడు. ఇందుకు వారి బంధువులు కూడా సహకరించడం గమనార్హం. చత్తీస్‌గఢ్‌లోని జాష్ పూర్‌లో జరిగిన ఈ సంఘటన పూర్తి వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. నెల రోజుల క్రితం నిందితుడి సోదరుడు మానసిక రోగిగా మారడంతో సద్గురు ఆశ్రమానికి చెందిన తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు మంత్రించినందుకే వ్యక్తి రోగిగా మారాడని తాంత్రికుడు మోహన్ యాదవ్ తెలిపాడు. వారిని చంపేస్తే సోదరుడు మామూలు మనిషిగా మారుతాడని, ఆర్ధికంగా కూడా ఇబ్బందులు ఉండవని చెప్పడంతో బావ, సోదరుడితో కలిసి నిందితుడు హత్యకు పథకం రచించాడు. నిందితుడి బావ జులై 30న ఓ వాహనం, తాడు, టవల్, ప్లాస్టిక్ సింక్ కొనుగోలు చేయగా, హత్య చేశాక శవాలను మహానదిలో పడేయాలని ప్లాన్ వేసుకున్నారు. తర్వాత మీ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడని చెప్పి తల్లిదండ్రులను వాహనంలో ఎక్కించి సురాజ్ గఢ్‌లోని మహానది వంతెన వద్దకు తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశారు. చివరికి హత్య విషయం బయటపడగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. 17 ఏళ్ల కీలక నిందితుడు విచారణలో తానే హత్య చేశానని, ఇందుకు సహకరించిన వారి పేర్లను బయటపెట్టడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా మీడియాకు వెల్లడించారు.