ఓ సవతి తండ్రి చేసిన పని సమాజం తలదించుకునేలా ఉంది. మైనర్ అయిన సవతి కూతురిపై మారు తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు విచారించి తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించగా, చివర్లో కూతురు క్షమించి వదిలేయమని కోరడంతో అక్కడున్న వారందరూ కంటతడి పెట్టుకున్నారు.
ముంబైలో జరిగిన ఈ అమానవీయ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 41 ఏళ్ల తండ్రి సవతి కుమార్తెపై 2019 అక్టోబర్ నుంచి 2020 జూన్ వరకు అత్యాచారం చేశాడు. దీంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చగా, తల్లి సాయంతో ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. బాలికకు వైద్య పరీక్షలు చేయగా, నాలుగు నెలల గర్భం అని తేలింది. కోర్టు అనుమతితో గర్భాన్ని తొలగించిన అనంతరం పిండానికి తండ్రి డీఎన్ఏతో పోల్చి చూశారు. సరిపోలడంతో ఘోరంగా పరిగణించిన కోర్టు నేరస్థుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ, విచారణ సమయంలో తల్లి, కుమార్తె తండ్రికి అనుకూలంగా మాట్లాడారు. అతడే తమకు జీవనాధారమని క్షమించి వదిలేయాలని కోర్టును ప్రాధేయపడ్డారు. కానీ, దోషిని శిక్షించకుండా ఎలా ఉంటామని కోర్టు వారిని ప్రశ్నించింది.