A mother buried a three-year-old girl alive in Bihar
mictv telugu

మూడేళ్ల చిన్నారి సజీవ సమాధి.. వెలికితీస్తే షాకింగ్ విషయం చెప్పింది

July 12, 2022

మూడేళ్ల చిన్నారిని తన తల్లి, అమ్మమ్మలే సజీవ సమాధి చేసిన దారుణ సంఘటన బీహార్‌లోని చాప్రాలో చోటు చేసుకుంది. అనుమానం వచ్చి గ్రామస్థులు తవ్వి చూడగా సజీవంగా ఉన్న బాలిక బయటపడింది. విషయం పోలీసులకు చేరడంతో వారు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కోప మర్హా నది ఒడ్డున ఉన్న శ్మశానంలో ఏదో పని మీద స్థానిక మహిళలు వచ్చారు. అక్కడ ఒక చోట ఏదో కదులుతున్నట్టు కనిపించడంతో వారు గ్రామస్థులు, పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడకి చేరుకున్న గ్రామస్థులు పోలీసుల సమక్షంలో గడ్డ పారతో తవ్వి చూడగా, మూడేళ్ల బాలిక బయటపడింది. సపర్యల అనంతరం బాలికను వివరాలు అడుగగా, గ్రామం పేరు తెలియదని, కానీ, తన తల్లి పేరు రేఖాదేవి, తండ్రి పేరు రాజు శర్మ అని తెలిపింది. మరి సమాధిలోకి ఎలా వచ్చావని ప్రశ్నించగా, తన తల్లి, అమ్మమ్మలు కలిసి నోట్లో మట్టి పెట్టి పూడ్చిపెట్టారని ఏడుస్తూ విస్తుపోయే విషయం చెప్పింది. అనంతరం బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.