Home > Featured > రివాల్వర్ రాణి.. ఆమె పేరు చెప్తే ఆకతాయిలకు హడల్..

రివాల్వర్ రాణి.. ఆమె పేరు చెప్తే ఆకతాయిలకు హడల్..

ఆడవాళ్ళకు అన్యాయం చేసే విలనూ మగవాడే.. వాళ్లనూ రక్షించే హీరో మగవాడే. ఈ ఆచారం కొనసాగినంతకాలం మహిళల గ్రహచారం బాగుపడదని కొందరు మహిళా సంఘాల విజ్ఞులు అంటున్న మాట. స్త్రీ శక్తి అనడం కాదు చేతల్లో చూపించాలి. తనను తానే రక్షించుకునే స్థాయికి ఎదిగినప్పుడే అరాచకాలకు అంతం వుండదు. అలాంటి ధీరవనితలు రావాలంటే.. ముందుగా కొందరు మహిళలు స్ఫూర్తిగా రావాల్సి వుంటుంది. అలాంటి స్ఫూర్తివంతమైన మహిళ ఈమె. ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగిందని ఒక్క ఫోన్ కాల్ వస్తే చాలు అక్కడ వాలిపోతుంది.

అగంతకుల అంతుచూస్తుంది. లేడీబాస్ విజయశాంతిలా కామాంధుల ఆట కట్టిస్తుంది. ఇంతకీ ఆవిడ ఎవరంటే.. బిహార్‌‌లోని పట్నా జిల్లా అలంపూర్‌ గోన్‌పుర గ్రామ సర్పంచ్‌ అభాదేవి. ఆమె సర్పంచ్‌గా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే కాదు గ్రామ ప్రజల యోగ క్షేమాలు కూడా చూసుకుంటుంది. ఆ వూరి ఆడపిల్లపై మగ ఈగ వాలాలంటే గడగడలాడాలి. ఆమె పేరు చెప్తే ఆ చుట్టుపక్కల పోకిరీలకు చల్లని చెమట్లు పడతాయి.

రేప్, ఈవ్‌టీజింగ్, గృహహింస, దాడులు ఇలా మహిళలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని అక్కడ చేరుకుంటుంది.

మృగాళ్ల తాట తీస్తుంది. ఇలా ఆ ఒక్క గ్రామానికే ఆమె రక్ష కాదు చుట్టుపక్కల 13 గ్రామాల్లో మహిళలకు ఆమే పెద్ద దిక్కు. మహిళల హక్కులకు ఎలాంటి భంగం కలిగినా ఊరుకోదు. పోలీసులు సైతం ఈవ్‌టీజింగ్‌ కేసులు తమ వద్దకు వస్తే ఆమె దగ్గరకే వెళ్లమని సూచించడం విశేషం. ఎప్పుడూ రివాల్వర్‌ చేతబట్టుకొని తిరగడంతో ఆమెను స్థానికులు 'లేడీ సింగం' ' రివాల్వర్‌ రాణి'గా పిలుస్తున్నారు.

అక్కా నాకు ఈ కష్టం వచ్చిందని ఫోన్ రాగానే గన్ తీసుకుని బయలుదేరుతుంది. ఆమె వస్తోందని తెలిస్తే పారిపోవడం ఆకతాయిలు, రౌడీలు, గూండాల పని. అవసరమైతే కాల్చేందుకు కూడా వెనకాడదని మహిళా సంఘాలు చెబుతున్నాయి. 2011, 2016 సంవత్సరాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఆమె సర్పంచ్‌గా ఎన్నికైంది. ఆమెను సహించలేని కొందరు 2015లో అభాదేవిపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. కానీ ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకొంది.

అప్పుడే ఓ లైసెన్స్ తుపాకీ తీసుకుంది. భర్త వద్ద తుపాకీ ప్రయోగించే శిక్షణ తీసుకుంది. 2017లో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామంలో మత ఘర్షణలు చెలరేగాయి. ఇరువర్గాలు దాడులకు దిగారు. అక్కడకు చేరుకున్న ఆమె ఒక కర్ర తీసుకుని ఇరువర్గాలను చెదరగొట్టింది. ఇలా చెప్పుకుంటూపోతే ఆమె ఎన్నో సమస్యలను సావధానించింది.

సర్పంచ్‌గానూ పంచాయతీ కార్యాలయానికి నూతన భవనాన్ని నిర్మించింది. పాఠశాల భవనాలు, తాగునీటి సౌకర్యం, కళాశాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. తనకు మహిళల రక్షణ కల్పించే బాధ్యత రావడం చాలా ఆనందంగా వుందని చెబుతోంది.

Updated : 2 Sep 2019 10:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top