a Muslim couple gave huge donation to Tirumala Venkanna
mictv telugu

తిరుమల వెంకన్నకు భారీ విరాళం ఇచ్చిన ముస్లిం దంపతులు

September 20, 2022

కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం కోట్ల రూపాయల డబ్బు విరాళంగా వస్తుంది. భక్తుల కానుకలతో పాటు భూరి విరాళాలు అధిక మొత్తంలో ఖజానాకు చేరుతుంటాయి. ఈ క్రమంలో చెన్నైకి చెందిన ముస్లిం దంపతులు భారీ విరాళం ఇచ్చారు. సుబీనా బాను, అబ్దుల్ ఘనీ అనే జంట తిరుమలకు వచ్చి విరాళం తాలూకు చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ విరాళం మొత్తం రూ.1.02 కోట్లు కాగా, అందులో రూ. 87 లక్షలను ఇటీవల ఆధునీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో కొత్త ఫర్నీచర్, వంటశాలలో పాత్రలకు వినియోగించాలని కోరారు. మిగతా రూ. 15 లక్షలను ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఇచ్చారు. కాగా, తిరుమల వెంకన్నను హిందువులతో పాటు ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్న విషయం తెలిసిందే. ముస్లిం వర్గానికి చెందిన బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసుకున్నారని ప్రతీతి.