శారదా అమ్మవారికి రూ. 8 లక్షల చీర నేసిన ముస్లిం కుటుంబం - MicTv.in - Telugu News
mictv telugu

శారదా అమ్మవారికి రూ. 8 లక్షల చీర నేసిన ముస్లిం కుటుంబం

September 24, 2022

కర్ణాటకలో ఘనంగా జరిగే మంగుళూరు దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో శ్రీ వెంకటరమణ దేవాయంలోని ఆచార్య మఠం ప్రాంగణంలో శారదా అమ్మవారి విగ్రహానికి పూజలు చేయనున్నారు. 1922లో ప్రారంభమైన ఈ శారదా మహోత్సవం ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంటుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 6న అమ్మవారికి రూ. 8 లక్షల ఖరీదైన చీరను అలంకరించనున్నారు. ఈ చీరను ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జ్ఞానవాసి మసీదు సమీపంలో నివసించే ఓ ముస్లిం కుటుంబం నేసింది. ఈ కుటుంబం ఐదు తరాలుగా నేత వృత్తిలో ఉండగా, 1988 నుంచి శారదా దేవికి చీరను నేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఎనిమిది మీటర్ల హరవీణ బనారస్ చీరను సిద్ధం చేశారు. కుటుంబంలోని నలుగురు నెలన్నర రోజులు కష్టపడి చీరను నేయగా, నాలుగు రోజుల్లో ఎంబ్రాయిడరీ పూర్తయింది.

చీరలో మొత్తం 11 పవనాల బంగారం, 700 గ్రాముల వెండి ఉపయోగించారు. ఈ ఘటనను దేశంలోని మతసామరస్యానికి నిదర్శనమని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అటు అమ్మవారిని పది లక్షలతో నిర్మించిన చెక్క మండపంలో ప్రతిష్టించనున్నారు. వీటితో పాటు భక్తులు బంగారంతో చేసిన వీణ, నెమలి బొమ్మలను విరాళంగా ఇచ్చారని, అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లేందుకు వెండితో చేసిన మెట్లను అమర్చుతున్నామని ఉత్సవాల నిర్వహణ సమన్వయ కర్త మంజు నీరేశ్ వాల్య తెలిపారు. కాగా, చీర విషయంలో కుల్యాదికార్స్ టెక్స్‌టైల్స్ సంస్థకు చెందిన సుధీర్ పాయ్ అర్ధిక సహకారం అందించారు.