A Muslim man kahinoor has been celebrating Navratri for 37 years in odisha
mictv telugu

37 ఏళ్లుగా నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న ముస్లిం వ్యక్తి.. కమిటీకి ఆయనే హెడ్

September 27, 2022

భిన్న మతాలు, ధర్మాలు ఉన్న భారతదేశంలో కొన్నిచోట్ల మత కలహాలు చెలరేగుతుండగా, మరికొన్ని చోట్ల మత సామరస్యానికి నిదర్శనమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. హిందువులు పవిత్రంగా పూజించే దుర్గామాత నవరాత్రి వేడుకలను ఓ ముస్లిం వ్యక్తి 37 ఏళ్లుగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న విషయం తాజాగా దేశం దృష్టిని ఆకర్షించింది. ఒడిషాలోని గంగరాజ్ పంచాయితీ పరిధిలోని టెంటులిడింగ అనే గ్రామంలో కహినూర్ అనే ముస్లిం వ్యక్తి దుర్గాపూజ ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తాడు. కమిటీలో సుమారు 500 మంది సభ్యులుండగా, ఇన్నేళ్ల నుంచి కమిటీ అధ్యక్షుడిగా కహినూరే ఉన్నారు. ఇందుకు గ్రామంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. అసలు నవరాత్రి వేడుకలు నిర్వహించాలని ప్రతిపాదించిందే కహినూర్ అని గ్రామస్థులు చెప్తున్నారు. 1986లో గ్రామంలోని హిందూ మహిళలు సమీపంలోని బరిపడ పట్టణానికి వెళ్లడాన్ని గమనించిన కహినూర్ ఇస్లాం.. తమ గ్రామంలోనే వేడుకలను ఎందుకు నిర్వహించకూడదని ఆలోచించి గ్రామ ప్రజల ముందు ప్రతిపాదన పెట్టాడు. వారు సరేననడంతో విరాళాలు సేకరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అప్పటినుంచి దసరా పండుగ ఆ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. నవరాత్రుల అనంతరం అన్ని వర్గాల ప్రజలకు ప్రసాదం పంపిణీ చేస్తారు. కాగా, కహినూర్ ఇద్దరు కుమార్తెలు ఉన్నత చదువులు చదికి ఎమ్మెన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు.