A new airport in Chennai at a cost of 20 thousand crores
mictv telugu

20 వేల కోట్లతో చెన్నైలో కొత్త ఎయిర్‌పోర్ట్

August 3, 2022

దక్షిణాదిన ప్రఖ్యాత నగరం చెన్నైలో మరో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే మద్రాసు ఇంటర్నేషనల్ మీనంబాక్కం ఎయిర్ పోర్టు ఉండగా, రాబోయే కాలంలో ఏర్పడే డిమాండును తట్టుకోవడానికి మరో విమానాశ్రయం అవసరపడుతుందని ఆ రాష్ట్రం అంచనా వేసింది. ఈ మేరకు సీఎం స్టాలిన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రస్తుతం డీపీఆర్ రూపొందిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంస్థ టిడ్కో చెన్నై సమీపంలోని పరందూర్ సమీపంలో స్థల అన్వేషణ చేస్తుందని వివరించారు. ఏడాదికి 10 కోట్ల మంది ప్రయాణించేలా రూ. 20 వేల కోట్లతో నూతన ఎయిర్ పోర్టును నిర్మిస్తామని స్టాలిన్ వెల్లడించారు. రెండు రన్‌వేలు, ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ట్యాక్సీ వేలు, యాప్రాన్‌లతో సకల సదుపాయాలు కల్పించనున్నామన్నారు.