ఆధునిక కాలంలో యువతీయువకుల మధ్య ప్రేమ వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. అయితే దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లే ధైర్యం లేక చాలా మంది పెద్దలు కుదిర్చిన సంబంధాలు చేసుకుంటున్నారు. కానీ కొందరు వ్యూహాత్మకంగా పెళ్లి తంతు ముగిసే వరకు మౌనంగా ఉండి ఆ తర్వాత తమ ప్రణాళికను అమలు పరుస్తున్నారు. యూపీలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన పైవ్యాఖ్యలను నిరూపిస్తోంది. మీర్జాపూర్‌లోని జౌన్‌పూర్‌కి చెందిన ఓ యువకుడికి అజంగఢ్‌కి చెందిన యువతితో ఈ నెల 10న వివాహమయ్యింది. తంతు అంతా పూర్తయ్యాక ఈ నెల 19న వరుడి తల్లి, తండ్రితో కలిసి వధువు సమీపంలోని వింధ్యవాహిని ఆలయానికి దర్శనం కోసం వెళ్లారు.
దర్శనం అనంతరం అందరూ భోజనం చేస్తుండగా, వాష్‌రూంకి వెళ్లివస్తానని వధువు భర్త దగ్గర 10 రూపాయలు అడిగి తీసుకొని వెళ్లిపోయింది. కాసేపటికి గమనించిన వరుడు పరిసరాలను ఎంత వెతికినా భార్య కనిపించకపోవడంతో కంగారుగా పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేశాడు. వారు వచ్చి సీసీకెమెరాలను పరిశీలించగా, ఆలయం నుంచి బయటకి వచ్చిన వధువు అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రియుడితో బైకుపై వెళ్లడం కనిపించింది. దీనిపై పోలీసులు మాట్లాడుతూ రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి వరుడు అలా చేస్తాడా? లేక పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటాడా? అనేది తెలియాల్సి ఉంది.