పెళ్లి అంటే నూరేళ్ల పంట. ప్రతి ఒక్కరూ తమ వివాహం వైభవంగా జరగాలని కోరుకుంటారు. భారీ సెట్లు, అదరిపోయే భోజనాలతో ఘనంగా జరగాలని ఆశిస్తారు. వివాహం ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని ఆరటాడపడతారు. ప్రస్తుత ట్రెండ్‌లో యువతి, యువకులు వివాహనికి ముందు ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటూ ఎవరికి వారే తమ ప్రత్యేకతను చాటుతున్నారు. ఇటువంటి సమయంలో పెళ్లికి సిద్ధమయ్యే ఓ జంట సామాజిక బాధ్యతతో వినూత్నంగా ఆలోచించారు. తమ పెళ్లి సందర్భంగా అవయవ దానంపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. పెళ్లి రోజున తమ బంధువులను, స్నేహితులను అవయవ దాన హామీ పత్రాలు బహుమానంగా ఇమ్మని కోరారు. పెళ్లి పత్రికలో సైతం కూడా అవయవదానం చేయడం-ప్రాణదాతలు కండి అని మద్రించారు.
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన సతీష్ కుమార్ చిన్నప్పటి నుంచి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు. అతనికి ఇటీవల దొమ్మేరు గ్రామానికి చెందిన యువతి సజీవ రాణితో ఇటీవల వివాహం నిశ్చయమైంది. నిడదవోలులోని డా.బీఆర్ అంబేద్కర్ కల్యాణ మండపంలో గురువారం వీరిద్దరు పెళ్లి పీటలెక్కనున్నారు. ఇక అవయవ దానంపై తనకున్న ఆలోచనను యువకుడు, యువతితో పంచుకున్నాడు. పెళ్లి సమయంలో అవయవ దానంపై అవగాహన పర్చేందుకు కార్యక్రమాన్ని చేపడదామని తెలిపాడు. దీనికి ఆమె ఆంగీకారం తెలిపింది. వారి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు కూడా గౌరవించి..సంతోషం వ్యక్తం చేశారు. పెళ్ళికూతురుతో పాటు, బంధువులు, స్నేహితులు పెళ్లిరోజు అవయవదాన హామీ పత్రం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సుమారు 60 మంది అవయవదాన హామీ పత్రాలు పెళ్లి రోజు సమర్పించనున్నారు. దీనిపై సావిత్రీబాయి ఫూలే ఎడ్యూకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు వారు సంతోషం వ్యక్తం చేశారు.
“రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నీ పనిచేయక ఓ బాలుడు చనిపోయాడు. బాలుడి చికిత్స సమయంలో కిడ్నీ దానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పటి నుంచి నాకు అవయవ దానం అవసరం తెలిసింది.” అని యువకుడు సతీష్ కుమార్ తెలిపాడు.