అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తున్నా : బాలీవుడ్ స్టార్ హీరో - MicTv.in - Telugu News
mictv telugu

అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేస్తున్నా : బాలీవుడ్ స్టార్ హీరో

June 2, 2022

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. అక్షయ్ కుమార్ తాజాగా నటించిన చిత్రం ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపారు. అలాగే ఈ మధ్య చర్చకొచ్చిన ఉత్తర, దక్షిణ భారత సినిమాల అంతరం గురించి కూడా తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘సినిమాలకు సంబంధించి ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజించడం నాకు ఇష్టం ఉండదు. మనది ఒకటే ఇండస్ట్రీ. ప్రస్తుతం అన్ని భాషల నటీనటులు కలిసి నటించే సమయం ఆసన్నమైంది. నేను త్వరలో అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్నా. మరో దక్షిణాది నటుడితో కూడా నటించబోతున్నా’నని స్పష్టం చేశారు. అయితే అల్లు అర్జున్‌తో చేయబోయే చిత్రానికి దర్శకుడు ఎవరు? మరో దక్షిణాది నటుడెవరు? అనే విషయాలను అక్షయ్ బయటపెట్టలేదు. కాగా, చరిత్రలో పేరు గాంచిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ కథానాయిక. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శుక్రవారం విడుదల కానుంది.