మద్యం మాన్పించే దేవుడు.. రాయలసీమలో - MicTv.in - Telugu News
mictv telugu

మద్యం మాన్పించే దేవుడు.. రాయలసీమలో

May 23, 2022

మద్యానికి బానిసైన వారితో ఆ దురలవాటు మాన్పించే శక్తి కల దేవుడు, దేవాలయం రాయలసీమలో ఉంది. అనంతపురం జిల్లా బొమ్మనహళ్లి మండలంలోని ఉంతకల్లులో ఈ మహిమాన్విత దేవాలయం ఉంది. ఆంధ్ర పండరీపురంగా పిలుచుకునే ఈ ఆలయంలో రుక్మిణీ పాండురంగ స్వామి కొలువై ఉన్నారు. మహారాష్ట్రలోని పండరీపురానికి ఏమాత్రం తక్కువ కాకుండా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ గనక మాల వేస్తే తిరిగి ఏ వ్యక్తి అయినా మద్యం జోలికి వెళ్లడని ఇక్కడి స్థానికుల నమ్మకం. చాలా మంది ఈ రకంగా మాల వేసి మద్యపానాన్ని విడిచిపెట్టారంట. అందుకే ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని ఆలయ ప్రధాన అర్చకులు రామాంజనేయులు తెలిపారు. కేవలం మద్యం మాత్రమే కాకుండా మనిషిలోని చెడు గుణాలను సైతం స్వామివారు పోగొడుతారంట. మాల వేసిన వ్యక్తుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని స్థానికులు చెప్తుంటారు. జిల్లా కేంద్రం అనంతపురానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలో మే 26న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా మహారాష్ట్ర పండరీపుర పీఠాధిపతి గోపాల్ రాజ్ మహారాజ్ రానున్నారు. ఈ విషయాన్ని మందు అలవాటు బాగా ఉన్న కుటుంబాల వారికి తెలియజేయండి. మీ కుటుంబాల్లోనే అలాంటి వారు ఉంటే ఓసారి ఉంతకల్లు వెళ్లి మాల వేసి ప్రయత్నించండి. దేవునిపై నమ్మకంతో చేసే పని ఎప్పుడూ వృథా కాదు.