A odisha husband sold his wife for alcohol in delhi
mictv telugu

మద్యం కోసం భార్యను అమ్మేసి.. ఘనంగా పెళ్లి చేసి పంపిన భర్త

November 15, 2022

మూడు ముళ్ల బంధంతో కట్టుకున్న భార్యను ప్రేమగా చూసుకోవాల్సింది పోయి ఏకంగా ఆమెనే అమ్మేశాడు ఓ భర్త. మద్యం కొనడానికి డబ్బుల్లేక, కష్టపడి సంపాదించే ఓపిక లేక ఈజీగా ఉంటుందని అమ్మేశాడు. అంతటితో ఆగకుండా తానే దగ్గరుండి కొన్న వ్యక్తితో పెళ్లి జరిపించి అతడితో పంపించేశాడు. ఒడిషాలో జరిగిన ఈ దారుణ, వింత ఘటన గురించి సదరు భార్య తల్లిదండ్రలకు ఫోన్ చేసి చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. కలహండి జిల్లా జరగ్గాకు చెందిన ఖిరా బెరుక్ అనే పాతికేళ్ల యువకుడికి పూర్ణిమా భోయ్ (22) అనే మహిళతో గతేడాది వివాహం జరిగింది.

అయితే ఖిరాకు మద్యం అలవాటు ఉండడంతో రోజూ తాగేవాడు. ఈ క్రమంలో రానురాను చేతిలో డబ్బులు అయిపోవడంతో భార్యను అమ్మేయాలని డిసైడ్ అయ్యాడు. భార్యకు పని పేరుతో మాయమాటలు చెప్పి ఢిల్లీకి తీసుకెళ్లాడు. అక్కడ హర్యానాకు చెందిన ఓ వ్యక్తికి భారీ మొత్తానికి అమ్మేశాడు. డబ్బు చేతికి రావడంతో ఇంకో అడుగు ముందుకేసి స్వయంగా వారికి పెళ్ళి జరిపించి పంపించేశాడు. భార్యను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెను తనతో తీసుకెళ్లి నిర్భంధించాడు. అయితే ఈ నెల ఐదో తేదీన పూర్ణిమ అతని చెర నుంచి తప్పించుకుని జరిగిందంతా ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాడు చేశారు. దీంతో నివ్వెరపోయిన పోలీసులు ఢిల్లీ వెళ్లి, భర్త ఖిరాతో పాటు పూర్ణిమ, ఆమెను కొన్న వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బాధితురాలిని పేరెంట్స్‌కి అప్పగించి వారిద్దరిని రిమాండుకు తరలించారు.