వడ్డీతో కలిపి ఇవ్వాల్సిందే.. జీతాలపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

వడ్డీతో కలిపి ఇవ్వాల్సిందే.. జీతాలపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

August 12, 2020

A.P High Court Order to Pay Salary And Pensions

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు జీవోలను రద్దు చేస్తూ వచ్చిన ధర్మాసనం మరోసారి షాక్ ఇచ్చింది. ఇటీవలి వరకు పెండింగ్‌లో ఉన్న జీతాలు పెన్షన్లను 50 శాతం మేర ఇవ్వాలని తీసుకువచ్చిన జీవోను కూడా న్యాయస్థానం రద్దు చేసింది. వెంటనే 12 శాతం వడ్డీ కలిపి మార్చి, ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపిన ప్రభుత్వానికి షాక్ తగిలింది. 

కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లను 50 శాతం చెల్లింపులు మాత్రమే చేయాలని జీవో తెచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ రిటైర్డ్ జడ్జి కామేశ్వరి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టివేశారు. ఇలాంటి సాకులు చూపడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. వెంటనే వడ్డీతో కలిపి బకాయిలను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.