a person cheated to Security agency by using the name of BRS party
mictv telugu

ప్రగతి భవన్ నుంచి మాట్లాడుతున్నా.. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకి సెక్యూరిటీ కావాలి

November 5, 2022

తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరును మార్చి బీఆర్ఎస్‌గా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పార్టీ పేరు చెప్పి ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. బీఆర్ఎస్ ఆఫీసు శంషాబాదులో పెడుతున్నామని, దానికి సెక్యూరిటీ కావాలంటూ ఓ ఏజెన్సీకి ఫోన్ చేసి రూ. 20 వేలు టోకరా వేశాడు. చివరికి మోసపోయామని గ్రహించిన సదరు సంస్థ ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో జీ2డబ్ల్యూఎస్ ఫెసిలిటీస్ అనే సెక్యూరిటీ సిబ్బందిని సరఫరా చేసే సంస్థ ఉంది. ఈ సంస్థకు గురువారం ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి.. ‘నేను ప్రగతిభవన్ నుంచి మాట్లాడుతున్నా. శంషాబాదులో కొత్తగా కడుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద వంద మంది సెక్యూరిటీ సిబ్బంది కావాలి.

అయితే కాంట్రాక్టు కావాలంటే ముందుగా లైసెన్స్ తీసుకోవాలి. దానికి రూ. 20 వేలు ఖర్చవుతుంది’ అని చెప్పాడు. దాంతో అధికార పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని సంబరపడిన సదరు ఏజెన్సీ అతనికి డబ్బులు బదిలీ చేశారు. తర్వాత కాసేపటికే ఆ ఏజెన్సీకే చెందిన మరో సంస్థకు కూడా ఇలాగే సదరు వ్యక్తి ఫోన్ చేయడంతో జరిగిన మోసాన్ని గ్రహించిన యాజమాన్యం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.