రెండు క్వార్టర్లు తాగినా ఎక్కని నిషా.. హోం మంత్రికి ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

రెండు క్వార్టర్లు తాగినా ఎక్కని నిషా.. హోం మంత్రికి ఫిర్యాదు

May 9, 2022

కల్తీ మద్యం తాగడం వల్ల మత్తు ఎక్కట్లేదని ఓ వ్యక్తి ఏకంగా హోం మంత్రికి ఫిర్యాదు చేశాడు. వైన్ షాపులో మద్యం కొని రెండు క్వార్టర్లు తాగినా మత్తు ఎక్కకపోవడంతో మద్యం కల్తీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బహదూర్ గంజ్‌కు చెందిన లోకేష్ సోథియా అనే వ్యక్తి గత నెల 12వ తేదీన వైన్ షాపులో నాలుగు క్వార్టర్లు కొన్నాడు. మరో వ్యక్తితో కలిసి రెండు క్వార్టర్లు తాగగా, మత్తు ఎక్కకపోవడం, మద్యం వాసన రాకపోవడం గమనించాడు. అనంతరం మద్యం కల్తీ జరిగిందని భావించి మిగిలిన రెండు క్వార్టర్లను అలాగే ఉంచేశాడు. వాటిని తీసుకొని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాకు, ఆబ్కారీ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. 20 ఏళ్ల నుంచి మద్యం తాగుతున్న తనకు అసలు మందేదో, నకిలీ ఏదో తనకు తెలుసని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాక, కల్తీ మద్యంపై తగిన చర్యలు తీసుకునేలా వినియోగదారుల ఫోరంలోనూ ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. తన తరపున వాదించేందుకు లాయర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు వెల్లడించాడు.