A person who vaccinated 39 people with a single syringe was arrested
mictv telugu

ఒకే సిరంజీతో 39 మందికి టీకా వేసిన వ్యక్తి అరెస్ట్

July 29, 2022

మధ్యప్రదేశ్‌లో బుధవారం ఒకే సిరంజీతో 39 మంది విద్యార్ధులకు కరోనా టీకాలిచ్చిన ఉదంతం సంచలం రేపిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తిని అహిర్వార్‌గా గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 39 మంది విద్యార్ధులు 15 ఏళ్లకు పైబడిన వారు కాగా, వారంతా 9 నుంచి 12వ తరగతి చదువుతున్నారు. ఈ ఘటనపై మొదట్లో అహిర్వార్‌ను నిలదీయగా, జిల్లా స్థాయి వైద్యాధికారే తనకు ఇలా చేయమని చెప్పాడంటూ మాట్లాడిన వీడియో వైరల్ అయింది. తర్వాత అక్కడ్నుంచి తప్పించుకొని పారిపోయిన అహిర్వార్ మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఎట్టకేలకు అతడిని పట్టుకొని విచారిస్తున్నారు. విచారణలో ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్ధిగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో గురువారం జిల్లా స్థాయి అధికారిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశాడు. అటు వైద్యశాఖ తరపున కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి డీకే గోస్వామి తెలిపారు. కాగా, ఒకే సిరంజీతో కరోనా టీకా వేసిన 39 మంది విద్యార్ధుల శాంపిల్స్ తీసి పరీక్షించామని, వారి రిపోర్టులు సాధారణంగా ఉన్నాయని గోస్వామి వెల్లడించారు. సాగర్ పట్టణంలో జరిగిన ఈ సంఘటన దేశం చూపు తిప్పుకునేలా చేసింది.