ఈ రాయి ధర రూ. 19 కోట్లు.. ఏందబ్బా విశేషం!
ఆ రాయి ధర అచ్చంగా రూ.19 కోట్లు. అదేంటని ఆశ్చర్యపోకండి. గురువారం అమ్మకానికి వచ్చిన ఆ రాయి దాదాపు 13.5 కిలోల బరువు ఉంది. అది చంద్ర ఉల్క.. అందుకే దానికంత రేటు. క్రిస్టీస్‌లో అమ్మకానికి పెట్టిన ఈ మూన్‌రాక్ 2 మిలియన్ పౌండ్లు(2.49 మిలియన్ డాలర్ల) విలువ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ రాయిని సేకరించిన క్రిస్టీ సంస్థ ప్రైవేటు ప్లాట్‌ఫాంలో అమ్మకానికి పెట్టింది. ఎన్‌డబ్ల్యూఏ 12691గా పేరొందిన ఈ ఉల్క.. ఆస్టరాయిడ్ లేదా తోకచుక్కను ఢీకొట్టి సహారా ఎడారి ప్రాంతంలో పడినట్లుగా భావిస్తున్నారు.
దీని గురించి క్రిస్టీస్ సైన్స్ అండ్ నేచురల్ హిస్టరీ విభాగాధిపతి హైస్లోప్ మాట్లాడుతూ.. ‘భూమి మీద పడ్డ అతిపెద్ద చంద్ర ఉల్కల పరిమాణంలో ఇది ఐదో స్థానంలో నిలిచింది. మనకు తెలియని బాహ్య ప్రపంచానికి చెందిన ఓ వస్తువును చేతుల్లోకి తీసుకున్న అనుభవాన్ని ఎన్నటికీ మరచిపోలేం. ఇది చంద్రుడికి సంబంధించింది. ఫుట్‌బాల్ లేదా ఓ మనిషి తల కంటే పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఈ ఉల్క 2,40,000 మైళ్ల ప్రయాణం చేసిన తర్వాత భూమిని చేరింది. చంద్రుడిపై పరిశోధనలు జరిపిన సమయంలో అమెరికా అపోలో స్సేస్ మిషన్ సేకరించిన నమూనాలతో ఈ ఉల్కను పోల్చి చూశాం. అది చంద్రుడి ఏ భాగం నుంచి ఊడిపడిందో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1960, 70ల్లో అపోలో ప్రోగ్రామ్ ద్వారా 400 కిలోల మూన్‌రాక్‌ను తీసుకువచ్చారు. దానిలోని రసాయన, ఐసోటోపిక్ మిశ్రమాలను విశ్లేషించి.. ప్రస్తుత ఉల్కను పోల్చి చూస్తారు’ అని ఆయన వెల్లడించారు.