ఆర్ధిక సంక్షోభం నెలకొన్న శ్రీలంకలో యువతకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. ఎక్కడ చూసినా పేదరికం, నిరుద్యోగం తాండవిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది యువకులు వేరే దేశాలకు ఉపాధి నిమిత్తం వలస పోతున్నారు. ఈ క్రమంలో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న 20 ఏళ్ల వయసున్న నలుగురు యువతులు ఒక రాజకీయ నాయకుడి మోసానికి బలైపోయిన ఘటన తాజాగా వెలుగు చూసింది.
రుయాన్ పతిరానా అనే రాజకీయ నాయకుడు నలుగురు యువతులను ఉద్యోగం పేరుతో థాయిలాండ్ పంపిస్తానని చెప్పి చైనాకు పంపించేశాడు. అక్కడ వారిని 5 వేల డాలర్లకు అమ్మేశాడు. అంటే మన కరెన్సీలో రూ. 4.14 లక్షలు. అమ్మాయిలను కొనుగోలు చేశాక చైనీయులు వారిని చిత్రహింసలు పెట్టారు. ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు. చివరికి ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న యువతులు ఎట్టకేలకు థాయిలాండ్ చేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు యువతులకు రక్షణ కల్పించి లంక పోలీసులకు సమాచారమివ్వగా విచారణలో రాజకీయ నాయకుడి ప్రమేయం బయట పడింది.
దీంతో అతని ఇంటిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. అయితే అమ్మాయిల స్మగ్లింగ్ గ్యాంగ్ లీడర్ అనురాసేన్ మాత్రం తప్పించుకున్నాడని లంక పోలీసులు తెలిపారు. అటు నలుగురు అమ్మాయిలు మీడియాతో మాట్లాడుతూ చైనాలో పడిన బాధను ఏకరువు పెట్టారు. రోజంతా ఎండలో నిలబెట్టేవారని, మాట వినకపోతే కరెంట్ షాక్ ఇచ్చేవారని తమకు జరిగిన అన్యాయాన్ని తలచుకుని బోరున విలపించారు. కాగా, చైనీయులు లంకలోని అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటామని నమ్మించి తమతో చైనా తీసుకెళ్లి అమ్మేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేస్తామని పోలీసులు అంటున్నారు.