వీడియోలో చూసి.. రూ. 47 కోట్లిచ్చి కొనేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

వీడియోలో చూసి.. రూ. 47 కోట్లిచ్చి కొనేశాడు..

July 16, 2020

పావు కిలో వంకాయలను కొనడానికే కూరగాయల గంపను మొత్తం కెలుకుతారు మన ఆడవాళ్లు. ఇక నగలు, చీరల గురించి చెప్పాల్సిన పనిలేదు. పదికాలాల పాటు కాపురం చెయ్యాల్సిన ఇంటిని కొనాలన్నా ఎన్నోసార్లు ఆలోచిస్తారు. ఇంటి వాస్తు, నీటి సదుపాయం, దగ్గర్లో స్కూళ్లు రైల్వే స్టేషన్ వంటివెన్నో లెక్కలోకి వస్తాయి. కానీ ఓ మనిషి మాత్రం నిర్మానుష్య దీవిని వీడియోలో ఒకే ఒకసారి చూసి స్థలాన్ని కొనేశాడు. ఏ పది లక్షలకో, ఇరవై లక్షలతో కాదు. ఏకంగా రూ. 47 కోట్లు పోసి కొన్నాడు. 

ఐర్లాండ్‌లోని హార్స్ ఐలాండ్ దీవి అది. అక్కడ ఓ పాత భవనం ఉంది. చుట్టూ అందమైన అట్లాంటిక్ సముద్రం ఉంది. ఎంత అందంగా ఉంటే మాత్రం ఉలిపికట్టెలా అక్కడే ఉండిపోవడం సాధ్యం కాదని చాలా మంది దాన్ని పట్టించుకోలేదు. అయితే యూరప్‌కే చెందిన ఓ ధనికుడు ఆ ద్వీపం వీడియోను చూసి మనసు పారేసుకున్నాడు. దాన్ని అమ్మకానికి పెట్టిన సంస్థకు క్షణాల్లో డబ్బు పంపించి కొనేశాడు. 150 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఆ ద్వీపంలో కొన్ని కాటేజీలు కూడా ఉన్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో అతడు ఆరోగ్యం కాపాడుకోడానికే దీన్ని కొన్నట్లు భావిస్తున్నారు. 

హార్స్ ఐలండ్‌లో ఒకప్పుడు మనుషులు ఉండేవారు. 60 ఏళ్ల నుంచి అక్కడ ఎవరూ నివసించడం లేదు. దెయ్యాలు తిరుగుతున్నాయే ప్రచారం కూడా ఉంది. మాంటేగ్ రియల్ ఎస్టేస్ సంస్థ దాన్ని కొనుక్కుని అభివృద్ధి చేసింది. అక్కడ హెలిపాడ్, జిమ్, టెన్నిసప్ కోర్టు ఉన్నాయి. ఆరు బెడ్ రూంలతో కూడిన విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. అయినా ఇంతవరకూ ఎవరూ దానిపై ఆసక్తి చూపలేదు. కరోనా కల్లోలంలో దాన్ని ఇటీవల వేలం వేశారు. కరోనా వల్ల ఆదాయాలు పడిపోయాయని, ఎవరూ ముందుకు రారని అనుకున్నారు. కానీ ఓ వ్యక్తి ముందుకొచ్చి కనీసం ఆ దీవికి వెళ్లకుండానే, వీడియో చూసి కొనేశాడు. 

‘అంత మారుమూల దీవిని ఎవరు కొంటార్లే అనుకున్నాం. కానీ 47 కోట్ల ఆఫర్ వచ్చింది. మొదట నమ్మలేకపోయాం. దీవిని కొన్న వ్యక్తి తన పేరు బయటికి చెప్పొద్దని కోరాడు. కరోనా టైంలో యూరప్ ప్రజలు పల్లెలకు వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అతడు కూడా వైరస్ ను దృష్టిలో ఉంచుకునే కొన్నాడు.. ’ అని వేలం నిర్వాహకులు చెప్పారు.