టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు భద్రత కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. తనకు వ్యక్తిగతంగా శత్రువులు ఎవరు లేరని, తనకు ఏం జరిగినా జగన్ ప్రభుత్వామే బాధ్యత వహించాలని అన్నారు. చింతమనేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆయన ఎందుకు పోలీసులను ఆశ్రయించారు? ఏం జరిగింది? అనే విషయాలపై ప్రజలు తెగ ఆరా తీస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ‘తనకు ప్రాణ హాని ఉందంటూ చింతమనేని నేడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు ఒక బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని, తనను హత్య చేసేందుకు ఓ షూటర్‌ను కూడా నియమించినట్లు అగంతకుడు ఫోన్లో తనతో చెప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గన్‌మెన్ జీతాలకు డబ్బు చెల్లించే స్థోమత లేదని, పోలీసులే తనకు భద్రత కల్పించాలని ఆయన కోరారు. ఇప్పటికే తనపై ఎన్కౌంటర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని, రెండుసార్లు ప్రయత్నిస్తే, అదృష్టం కొద్ది మరణం నుంచి బయటపడ్డానని చింతమనేని ఫిర్యాదులో పేర్కొన్నారు” అని వివరాలను వెల్లడించారు.
మరోపక్క గత ఎన్నికల్లో చింతమనేని అబ్బయ్య చౌదరి చేతుల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చింతమనేని సైలెంట్ అయిపోయారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చింతమనేనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో పోలీసులు దుగ్గిరాలలో ఉన్న ఆయన నివాసంలో సోదాలు జరిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసేందుకు అజ్ఞాతం నుంచి బయటకొచ్చినట్లు చింతమనేని పోలీసులకు లొంగిపోయారు. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని, పోలీసులు భద్రత కల్పించాలని ఫిర్యాదు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.