చిన్న బాలుడు తాను రోజూ చూసే కార్టూన్ సీరియల్ ద్వారా తన ప్రాణాలు కాపాడుకున్నాడు. డోరెమాన్ అనే కార్టూన్ ఎంటర్‌టైనర్ సీరియల్‌లో జరిగినట్టు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసక్తికరంగా అనిపించే ఈ సంఘటన వివరాల్లోకెళితే.. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ నాలుగంతస్థుల పాత భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. శిథిలాల కింద కొన్ని కుటుంబాలు చిక్కుకోగా, మొత్తానికి ముగ్గురు మరణించారు. 12 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఇంకా కొంతమంది ఉంటారనే అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అయితే సిబ్బంది రక్షించిన వారిలో ఆరేళ్ల బాలుడు ముస్తఫా కూడా ఉన్నాడు. బిల్డింగ్ కూలినప్పుడు బెడ్డు కింద దాక్కున్న ముస్తఫా.. రెండ్రోజులు అలాగే ఉండి ప్రాణాలను నిలుపుకున్నాడు. సురక్షితంగా బయటపడ్డ ముస్తఫాను ఎలా వచ్చింది ఈ ఐడియా అని అడిగితే డోరెమాన్ కార్టూన్ సీరియల్ పేరు చెప్పాడు. ఆ సీరియల్లోని వివిధ ఎపిసోడ్‌లలో భవనాలు కూలినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు టేబుళ్లు, బెడ్ల కింద దూరేవారని, ఈ విషయం గుర్తుకు వచ్చి బిల్డింగ్ కూలినప్పుడు బెడ్డు కింద దాక్కున్నానని అమాయకంగా చెప్తున్నాడు. దీంతో సీరియళ్ల వల్ల చెడు మాత్రమే కాదు అప్పుడప్పుడు మంచి కూడా జరుగుతుందని ముస్తఫా నిరూపించాడని స్థానికులు అతని సమయస్పూర్తికి ప్రశంసలు కురిపించారు.