ఫోనుకు వచ్చే ఓటీపీ విషయంలో వివాదం చెలరేగి ఓ టెకీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోయంబత్తూరులో పనిచేసే ఉమేంద్ర అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ వారాంతం కావడంతో చెన్నైలో ఉండే బంధువుల ఇంటికి శనివారం కుటుంబసమేతంగా వచ్చాడు. ఆదివారం రోజు భార్యాపిల్లలతో కలిసి సరదాగా స్థానికంగా ఉండే ఓ మాల్లో సినిమా చూశాడు.
సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి ఉమేంద్ర భార్య ఫోనులో ఓలా క్యాబ్ బుక్ చేసింది. వారు ఉన్న చోటుకు క్యాబ్ రాగా, ఓటీపీ చెప్పే విషయంలో చిన్న గందరగోళం ఏర్పడింది. సరైన ఓటీపీ చెప్పలేదంటూ అందరూ కిందకి దిగమని డ్రైవరు డిమాండ్ చేశాడు. దాంతో ఉమేంద్ర కూడా ఆవేశానికి లోనై కారు దిగి డోరును విసురుగా వేశాడు. దీంతో కోపం పట్టలేకపోయిన డ్రైవరు ఉమేంద్రపై పిడిగుద్దులు గుద్దాడు. దాంతో కిందపడిపోయిన ఉమేంద్ర ఆ దెబ్బలకు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో కుటుంబీకులు క్యాబ్ డ్రైవరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవరుని అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ప్రకారం మొదట డ్రైవరే ఉమేంద్ర మొఖం వైపు ఫోన్ విసిరి, ఆ తర్వాత దాడి చేశాడని తేలినట్టు పోలీసులు తెలిపారు.