పల్లెకు అలాయి బలాయి.. ‘మా ఊరి సంత’ చూడండి(వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

పల్లెకు అలాయి బలాయి.. ‘మా ఊరి సంత’ చూడండి(వీడియో) 

November 20, 2019

‘సంత’ ఈ పేరు ఎత్తగానే ప్రతివారం ఊర్లలో జరిగే సంత గుర్తుకు వస్తుంది. తాజా పళ్లు, కూరగాయలు, మేకలు, గొర్రెలు, ఎద్దులు, కోళ్లు మార్కెట్ కళ్ల ముందు కదలాడుతుంది. ‘ఆ రూపాయ్.. రూపాయ్.. రూపాయ్.. అగ్గువ.. అగ్గువ.. అగ్గువ.. రండ్రి..రండ్రి.. రండ్రి..’ అని ఇలా వెరైటీగా అరుస్తూ వ్యాపారులు చేసే హంగామా చెవుల్లో మారుమోగుతుంది కదూ. వాళ్లు అమ్మడం.. కొనేవాళ్లు బేరాలు ఆడటం అంతా ఓ చిత్రమైన కలయికలా అనిపిస్తుంది. సంతలో రంగురంగుల సీతాకోక చిలుకల మాదిరి చుట్టుపక్కల గ్రామాలవాళ్లు అందరూ కలుస్తారు అక్కడ. ఆ గందరగోళంలో ఒకర్నొకరు ఆప్యాయంగా పలకరించుకుంటారు. ‘చేన్ల ఏం పంట ఏశిర్రు.. కల్పులు, కోతలు ఎప్పుడు? బిడ్డె కాన్పుకు వచ్చిందా? పిల్లలు బాగున్నరా? బర్రె పాలు మంచిగ ఇస్తున్నదా?’ ఇలా రకరకాల కుశల ప్రశ్నలు వేసుకుంటారు. కొత్త తినే దావత్‌లు కూడా ఇచ్చుకుంటారు. సంతలో వేసే వేడి వేడి బజ్జీలు తిని, ఓ సీస కల్లు తాగకుండా సంత ముగిసినట్టు అనిపించదు. 

ఇలా సంత గురించి చెప్పుకుంటే ఒడవని ముచ్చట్లు చాలా ఉంటాయి. అవన్నీ ఒకసారి రివైండ్ చేసుకోవాలంటే మీరు మా మైక్ టీవీ కొత్తగా విడుదల చేసిన వీడియో ‘మా ఊరి సంత’ను చూడాల్సిందే. ఆ మట్టి వాసనను మళ్లీ మీకు ఈ వీడియో పరిచయం చేస్తుంది. సంతలోని వింతలెన్నో మీ కళ్లకు కడుతుంది. చిన్నప్పటి దోస్తును కలిసి గాఢంగా అలాయి బలాయి ఇచ్చిన కమ్మటి ఫీలింగ్ కలిగిస్తుంది. పొలాల్లోంచి అప్పుడే కూరగాయలు కోసి గంపల్లో పెట్టుకుని అంగడికి వచ్చి అమ్ముకుని వెళ్లే అయ్యలు, అవ్వలు. బంజారా తాండాల నుంచి కూడా బంజారా మహిళలు కూరగాయలు బుట్టల్లో తెచ్చి అమ్ముతుంటారు. కొత్తబట్టలు, గాజులు, కమ్మలు, సబ్బు పెట్టెలు, సైకిల్ సవారీలు, దువ్వెనలు, ఇరుపెనలు, రొయ్యలు, ఒట్టి చేపలు, టిక్లీ బొట్లు, ప్లాస్టిక్ సామాన్లు, వెదురు బుట్టలు, చేటలు, రోల్డు గోల్డు దుకాణాలు, తాళం చెవులు అమ్మేటోళ్లు, కత్తులు, కొడవళ్లు సానబట్టేటోళ్లు.., ఇలా ఎందరో సంతలో మనకు ఆత్మీయుల్లా తారసపడతారు. అలాంటి నిండుకుండలాంటి సంతను చూసి జ్ఞాపకాలను ఎల్లవోసుకోవాలంటే ఒక్కసారి ఈ వీడియోను చూడాల్సిందే. మీకు మంచి అనుభూతిని పంచుతుంది. 

ఆధునీకత మాటును దాగిన మీలోని స్వచ్ఛమైన, నికార్సయిన పల్లె మనిషిని నిద్రలేపి కాసేపు మీ ఊరికి తీసుకెళ్తుంది. బోలెడు ఊసులు చెబుతుంది. పూర్తి వీడియో కోసం  క్రిందిలింకును క్లిక్ చేయండి.