ప్రేమలో మోసపోయిన ఓ మహిళ ప్రవర్తించిన తీరు ఆ దేశంలో సంచలనం సృష్టించింది. ఆవేశంలో మానసిక ఉద్రేకానికి గురైన ఆమె.. ఏకంగా 46 మందిని తగులబెట్టేసింది. అభివృద్ధి చెందిన, క్రైమ్ రేట్ తక్కువున్న తైవాన్లో ఈ ఘటన జరిగింది. హువాంగ్ కేకే (51) అనే మహిళ తన ప్రియుడు మోసం చేశాడన్న కోపంతో కాహ్సియుంగ్లోని బహుళ అంతస్థుల భవనానికి మంట పెట్టింది. దీంతో అందులో ఉన్న 46 మంది మరణించగా, 41 మంది మంటల్లో కాలి గాయపడ్డారు. వెంటనే అలర్టయిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి హత్యానేరం కింద కేసు పెట్టారు. నివేదికలో ఆమె ఉద్దేశపూర్వకంగా ఈ ఘాతుకానికి పాల్పడిందనీ, ఘటన తర్వాత కూడా ఆమెలో ఏమాత్రం పశ్చాత్తాపం కనపడలేదని కోర్టు వారికి నివేదించారు. కోర్టు బయట న్యాయవాదులు సైతం ఆమెను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు మహిళను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. అంతేకాక, ఉద్దేశపూర్వకంగా చేయలేదని, ప్రియుడికి నష్టం కలిగించాలనే ప్రతీకారాలోచనతో ఈ ఘటనకు పాల్పడిందని తీర్పు వెల్లడించింది. ఇదంతా ఆవేశంలో జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని తేల్చి చెప్పింది. దీంతో అసంతృప్తికి లోనైన న్యాయవాదులు ఈ కేసును పైకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించారు.