భారీ వర్షాలు కురుస్తున్నా, వరద తీవ్రంగా ఉన్నా తను చేసే డ్యూటీకి న్యాయం చేయాలని భావించిన తెలుగు రిపోర్టర్.. ఆ క్రమంలో వరదలో గల్లంతయ్యారు. ప్రముఖ తెలుగు ఛానెల్ తరపున పనిచేస్తున్న జమీర్ అనే జర్నలిస్ట్ జగిత్యాల రిపోర్టరుగా పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి వరదల్లో చిక్కుకుపోయిన తొమ్మిది మంది రైతు కూలీల సమాచారం సేకరించేందుకు మరో వ్యక్తితో కలిసి కారులో బయల్దేరాడు. వారిని కలిసి సమాచారం సేకరించి తిరిగి భూపతిపూర్ – రామోజీ పేట దారిలో కారులో వస్తున్నాడు. ఈ క్రమంలో దారిలో ఉన్న పెద్దవాగు గుండా వరద ప్రవహిస్తోంది. అయితే ప్రవాహాన్ని తక్కువ అంచనా వేసిన జమీర్.. వరదనీటి గుండా కారును పోనిచ్చాడు. అయితే కొంత దూరం వెళ్లాక ప్రవాహ ధాటికి కారు వాగులో కొట్టుకుపోయింది. తనతో వచ్చిన వ్యక్తి తప్పించుకోగా, జమీర్ కారుతో సహా ప్రవాహంలో కలిసిపోయాడు. విషయం తెలిసి గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగినా.. ఆచూకీ దొరకలేదు.