మన దేశ జాతీయ పతాకం మూడు రంగులతో, మంచిన బోధించిన ధర్మచక్రంతో విభిన్నంగా ఉంటుంది. సాధారణంగా మన పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, పచ్చని రంగులను విడివిడిగా రూపొందించి ఆపై కలిపి కుట్టేస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా వేమవరం గ్రామానికి చెందిన రుద్రాక్షుల రామలింగ సత్యనారాయణ అనే చేనేత కార్మికుడు మాత్రం మనదేశ జాతీయ పతాకంలోని మూడు రంగులను ఒకే వస్త్రంపై ఎలాంటి కుట్లు, అతుకులు లేకుండా రూపొందించడానికి పూనుకున్నాడు. అందుకు భారీగా ఖర్చవుతుందని తెలియడంతో సొంత ఇంటిని సైతం అమ్ముకోవడం విశేషం.
మనదేశ జెండాను ఇప్పటివరకు ఎవరూ తయారుచేయని విధంగా ఒకే వస్త్రంగా రూపొందించాలన్నది అతని సంకల్పం. కుట్లు లేకుండా జాతీయ జెండాను చేనేత మగ్గంపై తయారుచేయడానికి సుమారు రూ.6.5 లక్షలు ఖర్చవుతుందని తెలియడంతో తన స్వంత ఇంటిని అమ్మేశాడు. ఆపై ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని అందులోనే తన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నాడు. 8 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు ఉన్న ఈ త్రివర్ణ పతాకాన్ని ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగురవేయాలన్నది అతని కోరిక. సత్యనారాయణ మామూలుగా చీరలు నేస్తుంటాడు. ఓసారి తన ఆధ్వర్యంలో నేసిన సుమారు రూ.15 లక్షల విలువైన చీరలు రోడ్డు ప్రమాదంలో నాశనమయ్యాయి. పతాకం నేయడం మధ్యలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అయినా కూడా సత్యనారాయణ సంకల్పం వదల్లేదు. ఎర్రకోటపై ఎగరేసే జెండాలను కర్నాటకలోని హుబ్లీలో తయారుచేస్తారని తెలుసుకొని సరైన దారాలిస్తే అధికారులకు ఓ జెండా తయారు చేసిస్తాను అంటున్నాడు.