A ten carat diamond found by a farmer's daughter in karnool
mictv telugu

ఏపీ : రైతు కుమార్తె అదృష్టం.. కలుపు తీస్తుండగా దొరికిన 34 లక్షల వజ్రం

August 10, 2022

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన ఓ రైతు కుమార్తెకు పది క్యారెట్ల బరువైన వజ్రం దొరికింది. జి. ఎర్రగుడి గ్రామంలో తన సొంత వ్యవసాయ పొలంలో సాగు చేస్తున్న టమాటా పైరులో కలుపు తీస్తుండగా, ఈ వజ్రం లభ్యమైంది. దీంతో ఆ రైతు కుటుంబం పంట పండింది. విషయం తెలిసిన వెంటనే పెరవళి, జొన్నగిరి ప్రాంతాలకు చెందిన వ్యాపారులు రైతును సంప్రదించడానికి క్యూ కట్టారు. చివరకి వ్యాపారులంతా కలిసి ఆ వజ్రాన్ని రూ. 34 లక్షలకు కొనుగోలు చేశారు.

ఈ డబ్బుతో తన కుమార్తె పెళ్లి చేస్తానని, కొంత వ్యవసాయ పొలం కొంటానని ఆ రైతు సంతోషంతో వెల్లడించాడు. కాగా, ఏటా తొలకరి వర్షాల తర్వాత జొన్నగిరి, పగిడిరాయి, జి. ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. వ్యవసాయ పొలాల్లో చాలా మంది వజ్రాల కోసం వెతుకుతారు. స్థానికులే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఈ క్రమంలో వజ్రాలు దొరికిన వారు రాత్రికిక రాత్రే లక్షాధికారులవుతున్నారు. అటు అనంతపురం జిల్లాలో కూడా ఇలా వజ్రాలు దొరికే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వర్షాలు ప్రారంభమైనప్పుడు ఇలాంటి ప్రాంతాలు ప్రజల రాకతో సందడిగా ఉంటాయి. అయితే చాలా వరకు వజ్రాల కొనుగోలు రహస్యంగా జరిగిపోతుంటుంది. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి అమాయక రైతులను మోసం చేస్తుంటారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సహకారం అవసరమని స్థానికులు కోరుతున్నారు.