ఇప్పుడంతా ఫలితాల ప్రకటన కాలం నడుస్తోంది. అనేక పరీక్షల ఫలితాలు వరుసగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో కేరళలో కూడా పదవ తరగతి ఫలితాలు జూన్ 15న ప్రకటించారు. అయితే ఈ ఫలితాల్లో పాసైనట్టు తేలిన జిష్ణు అనే పదవ తరగతి అబ్బాయి చేసిన పని సంచలనంగా మారింది. మంచి మార్కులతో పాసైన జిష్ణు డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. తాను సాధించిన విజయాన్ని బ్యానర్‌పై ముద్రించి, తనను తాను అభినందించుకుంటూ ప్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఈ విషయం వైరల్ అయి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి వెళ్లింది. అతని ఆత్మవిశ్వాసం చూసి అవాక్కయిన మంత్రి శివన్.. ఆ ప్లెక్సీని, అందులో రాసి ఉన్న అక్షరాల అర్ధాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ప్లెక్సీలో విద్యార్ధి రాసుకున్న దాని ప్రకారం.. ‘కొంతమంది వస్తే చరిత్ర మారిపోతుంది. నేను కూడా ఆకోవకే చెందుతాను. ఇలాగే జీవితం పెట్టే పరీక్షలో కూడా విజయం సాధిస్తాన’ని కేజీఎఫ్ తరహాలో రాసుకున్నాడు. దాంతో విద్యార్ధిని అభినందించిన మంత్రి.. చదువు విషయంలో అతనికి కావాల్సిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ అంశంపై నెటిజన్లు డిఫరెంటుగా స్పందిస్తున్నారు. కొందరు రామ్ గోపాల్ వర్మతో పోల్చి జూనియర్ రామ్ గోపాల్ వర్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు.