చోరీ చేసి తప్పించుకోవడానికి పోలీసుల సాయం కోరాడు
దొంగతనం చేసి ఎవరికీ దొరక్కుండా తప్పించుకోవడం నిజంగా ఒక కళ అనే చెప్పాలి. చోరీ చేసినా ఆధారాలు లేకుండా చేయడం గురించి విని ఉంటాం. కానీ ఓ దొంగ మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించాడు. తప్పించుకోవడానికి ఏకంగా పోలీసులకే ఫోన్ చేసి సాయం కోరాడు. వారు వచ్చి అతడికి సాయం చేయడం గమనార్హం. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో చదవండి.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పరిసర బరిషల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నలభై ఏళ్లున్న ఓ దొంగ రాత్రిపూట ఓ దుకాణంలో దొంగతనానికి వెళ్లాడు. అందులోని సామానంతా మూటకట్టుకొని బయల్దేరుతుండగా, అప్పటికే తెల్లవారిందని గ్రహించి దుకాణంలోనే ఉండిపోయాడు. మెల్లగా జన సంచారం పెరిగి దొంగ ఆనవాళ్లు కనపడడంతో స్థానికులు దుకాణం వద్ద ఒక్కొక్కరిగా గుమిగూసాగారు. దీంతో వారి చేతిలో చావు దెబ్బలు తప్పవని గ్రహించిన సదరు దొంగ.. వారి బారి నుంచి తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఏకంగా పోలసులకే ఫోన్ చేసి సాయం కావాలని కోరాడు. దుకాణం నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావాలని అర్ధించాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు దుకాణం వద్దకు చేరుకొని దొంగను బయటికి తెచ్చారు. అనంతరం అరెస్ట్ చేసి స్టేషనుకి తరలించారు. దీనిపై పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఇలా జరగడం చరిత్రలోనే తొలిసారి అని చెప్పారు. అటు దొంగ మాత్రం పోలీసులకు దొరికిపోయినా జనాల చేతిలో చావు దెబ్బలు తప్పాయని ఊపిరి పీల్చుకున్నాడు.