మామాలుగా అయితే దొంగతనానికి వచ్చిన వారు.. అక్కడ కనిపించిందంతా దోచుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతుంటారు. కానీ.. ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఓ దొంగతనం మాత్రం.. చిత్ర విచిత్రగా మారింది. ఓ ఇంట్లో చోరీ కోసం వచ్చిన ఆ దొంగ.. విలువైన నగలు, వస్తువుల కోసం వెతికే క్రమంలో … ఓ ఫుల్ బాటిల్ కంటపడింది. ఇకంతే.. నాలుక లాగేస్తుందని, బాటిల్ ఓపెన్ చేసి తాగడం మొదలుపెట్టాడు. అలాగే రాత్రి అంతా కూర్చొని బాటిల్ ఖాళీ చేశాడు. సీన్ కట్ చేస్తే ఆ ఇంటి సభ్యులకు అడ్డంగా దొరికిపోయాడు.
యూపీలోని సినౌలీ గ్రామానికి చెందిన ప్రియాంక్ అనే వ్యక్తి దొంగతనం చేద్దామని నిర్ణయించుకొని గత ఆదివారం రాత్రి ఓ ఇంటికి వెళ్లాడు. బంగారు నగలు,డబ్బు కోసం వెతుకుతుండగా.. మద్యం బాటిల్ కనిపించింది. ఇంకేముంది దాన్ని చూశాక ఆ బాటిల్ సంగతేంటో చూడాలని తహతహలాడాడు. వచ్చిన పనేంటో కూడా మర్చిపోయాడు. మెల్లగా మొదలుపెట్టి బాటిల్ మొత్తం ఖాళీ చేసేశాడు. మత్తులో అక్కడే తూలిపోతూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో నుంచి మెలుకవ వచ్చింది. కానీ అప్పటికే పూర్తిగా తెల్లారిపోయింది. అప్పుడు అతడికి రాత్రి జరిగిన విషయమంతా గుర్తొచ్చింది.
వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలని అనుకున్నాడు. వెంటనే గోడ దగ్గరకు వెళ్లి పారిపోయిందేకు ట్రై చేశాడు. కానీ గోడ దూకుతుండగా ఆ ఇంట్లోని వారు, చుట్టుపక్కల వారు వచ్చి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ దొంగతనం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.