మహారాష్ట్రలోని ప్రముఖ పట్టణమైన ఔరంగాబాద్ పేరును ఉద్దవ్ థాకరే చివరి నిమిషంలో శంభాజీ నగర్‌గా మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ స్పందించారు. చివరి నిమిషంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన పనిగా వర్ణించారు. అంతేకాక, ఈ నిర్ణయం వల్ల ప్రజలపై పడే భారాన్ని ఏకరువు పెట్టారు. ‘కొందరు తమ మనుగడ కోసం ప్రతీదానికి మతం రంగు పులమాలని చూస్తారు. పేరు మార్పిడి అనేది మతాలకు సంబంధించినది కాదు. అది ఓ గుర్తింపు. అలాగే పేరు మార్పిడికి భారీగా ఖర్చవుతుంది. కేవలం ప్రభుత్వ డాక్యుమెంట్లలో పేరు మార్పిడికే వెయ్యి కోట్ల ఖర్చు వస్తుంది. అదికాక, ప్రజల ఆధార్ కార్డులలో, షాపుల డాక్యుమెంట్లలో పేరు మార్చుకోవాలంటే ప్రజలందరూ క్యూలలో నిల్చోవాల్సిందే. ఇంత భారాన్ని భరించేది శరద్ పవారో, ఉద్దవ్ థాకరేనో కాదు. మనమే భరించాలి. మనకెవ్వరూ సాయం చేయరు. సామాన్య ప్రజలకు ఇది చాలా కష్టంగా ఉంటుంద’ని అభిప్రాయపడ్డారు.