పోలీస్ ఉద్యోగాలకు భారీగా ఆప్లికేషన్లు .. ఒక్కో పోస్టుకు ఎన్నంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్ ఉద్యోగాలకు భారీగా ఆప్లికేషన్లు .. ఒక్కో పోస్టుకు ఎన్నంటే..

May 27, 2022

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాత పోలీస్‌ నియామక మండలి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశాయి. నోటిఫికేషన్‌ దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. W యూనిఫాం ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) వర్గాలు వెల్లడించాయి. పోలీస్‌, ఎక్సైజ్‌, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం17,516 పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయగా గడువు ముగిసే సమయానికి 12.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపాయి.

అంటే ఒక్కొక్క పోస్టుకు సగటున 72 దరఖాస్తులు వచ్చినట్టయ్యింది. మొత్తం 7.20 లక్షల మంది అభ్యర్థులు ఈ దరఖాస్తులను సమర్పించారు. పలువురు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారుల్లో 25 శాతం మంది మహిళలు ఉంటారని అంచనా. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి రోజుకు సగటున 49 వేల మంది చొప్పున దరఖాస్తు చేసుకొన్నట్టు బోర్డు అధికారులు చెప్తున్నారు. యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసినందున ప్రిలిమ్స్‌ పరీక్షల నిర్వహణపై టీఎస్‌ఎల్పీఆర్బీ అధికారులు దృష్టి సారించారు. ఆగస్టు మొదటి వారంలో ఎస్సై ప్రిలిమ్స్‌, మూడో వారంలో కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.