ఢిల్లీ అల్లర్లు.. పెళ్లైన 12 రోజులకే బలయ్యాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ అల్లర్లు.. పెళ్లైన 12 రోజులకే బలయ్యాడు..

February 28, 2020

Ashfaq Hussain

సీఏఏకు వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య రేగిన ఘర్షణల్లో దేశ రాజధాని ఢిల్లీ  అట్టుడుకుతోంది. ఈ అల్లర్లు ఓ ప్రేమజంటకు తీరని వ్యధను మిగిల్చాయి. వాలైంటైన్స్ డే రోజు పెళ్లి చేసుకుని 12 రోజులైనా గడవకముందే అశ్వాక్ అల్లర్లలో మృత్యువాత పడ్డాడు. ముస్తాఫాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే అశ్వాక్‌ హుస్సేన్‌, తస్లీన్ ఫాతిమాలు ప్రాణంగా ప్రేమించుకుని.. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని రోజులైనా గడవక ముందే వారి జీవితాల్లో చిచ్చు రగిల్చాయి సీఏఏ అల్లర్లు. ఫిబ్రవరి 25న భోజనం చేసి బయటకు వెళ్లిన అశ్వాక్‌ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా అశ్వాక్‌ ఫోటోను తస్లీన్‌ సోషల్‌ మీడియాలో తొలిసారి షేర్‌ చేశారు. ‘అత్తారింటికి వచ్చిన తొలి రోజే భర్త చనిపోవడం.. అసలు భర్త గురించి కూడా పూర్తి వివరాలు తెలియకుండానే విడిచి వెళ్లిపోయాడు’ అని  ఫాతిమా  కన్నీరుమున్నీరవడం నెటిజన్లను కలిచివేస్తోంది. బయట పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న అశ్వాక్‌ను పొడిచి చంపారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

అయితే అశ్వాక్‌ మృతి విషయం వారి కుటుంబ సభ్యులకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఘర్షణలో గాయపడ్డ అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. అయినా అతని మృతివార్త కుటుంబీకులకు చెప్పలేదు. పోస్ట్‌మార్టం కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే పూర్తిచేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శవాన్ని తీసుకెళ్లమని పోలీసులు చెప్పేవరకూ వారికి సమాచారం లేకపోవడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ అల్లర్లలో శుక్రవారం నాటికి మృతిచెందినవారి సంఖ్య 42కు చేరింది. ఈ ఘర్షణలో మృతి చెందినవారి వివరాలు ఇప్పడిప్పుడే బయటకు వస్తున్నాయి.